కేటీఆర్‌కు బిగ్‌షాక్
Formula E-Race: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR)పై ఫార్ములా-ఈ కారు రేసు నిర్వహణలో జరిగిన ఆర్థిక అక్రమాల ఆరోపణలపై విచారణకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి మంజూరు చేశారు. రాష్ట్ర కేబినెట్ సమావేశంలో చర్చించిన అనంతరం, గవర్నర్ ఆమోదాన్ని చీఫ్ సెక్రటరీ ద్వారా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కు పంపించనున్నారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 2023లో హైదరాబాద్‌లో ఈ రేసు నిర్వహణకు సంబంధించి, హెచ్‌ఎండీఏ నుంచి కేబినెట్, ఆర్థిక శాఖ, ఆర్‌బీఐ అనుమతులు లేకుండానే రూ. 55 కోట్లు విదేశీ కరెన్సీలో చెల్లించినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీనితో రూ. 8 కోట్లకు పైగా పన్ను జరిమానా విధించగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ మొత్తాన్ని చెల్లించింది. అక్రమాలపై అనుమానంతో ఈ రేసు రెండో సీజన్‌ను రద్దు చేసిన కాంగ్రెస్ సర్కార్, దీనిపై ఏసీబీ విచారణకు ఆదేశించింది.
2024 ఏప్రిల్‌లో ఏసీబీ ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఈ ఎఫ్‌ఐఆర్‌లో కేటీఆర్‌తో పాటు అప్పటి మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డి నిందితులుగా ఉన్నారు. మాజీ మంత్రి అయినందున, అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17ఏ కింద విచారణ చేపట్టడానికి గవర్నర్ అనుమతి తప్పనిసరి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌కు లేఖ రాయగా, డిసెంబర్ 2024లో ఆమోదం లభించింది. ఈ కేసులో కేటీఆర్ ఇప్పటికే నాలుగు సార్లు ఏసీబీ ముందు హాజరై విచారణలో పాల్గొన్నారు.