సర్పంచ్ ఏకగ్రీవం.. చెల్లదంటున్న అధికారగణం..
Sarpanch elections in Telangana:తెలంగాణ ఎన్నికల వేడి మెల్లిగా రగులుకుంటోంది. పంచాయతీ ఎన్నికల(Panchayat elections)కు సంబంధించి పల్లెల్లో నాయకులు తమ పార్టీ వారిని, అనుచరులను సిద్ధం చేస్తున్నారు. సర్పంచ్, వార్డు సభ్యులకు సంబంధించి అధికార యంత్రాగం కూడా సిద్ధమయ్యింది. ఈ నేపథ్యంలో నామినేషన్ల ప్రారంభం రోజునే సర్పంచ్ ఏకగ్రీవం చేస్తూ గ్రామస్తులు ప్రకటించారు.
ఆదిలాబాద్ జిల్లా(Adilabad District)లోని ఇంద్రవెల్లి మండలం తేజాపూర్ గ్రామ పంచాయతీ ఏకగ్రీవం అయ్యింది. ఆ గ్రామ పంచాయతీ పరిధిలోని తేజ్‌పూర్, సాలెగూడ, దొబ్బిగూడ గ్రామాల్లో పటేళ్లు సమావేశం అయ్యి సర్పంచ్‌తో సహా ఎనిమిది మంది వార్డుసభ్యులను ఏక గ్రీవం చేశారు. కోవా రాజేశ్వర్ అనే వ్యక్తిని ఏకగ్రీవం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే, బలవంతంగా ఏకగ్రీవాలు కుదరవని జిల్లా అధికారులు స్పష్టం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ ల ఏక గ్రీవం కోసం బెదిరింపులకు గురి చేయడం, భయపెట్టడం, సర్పంచ్ స్థానాన్ని డబ్బులకు వేలం వేయడం నేరమని కలెక్టర్ రాజర్షిషా(Collector Rajarshisha) స్పష్టం చేశారు.
నిబంధనలకు విరుద్ధంగా ప్రవరిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. నామినేషన్ స్వీకరణ, పరిశీలన, విత్ డ్రాల తర్వాతనే ఏకగ్రీవం అయినట్టు లెక్క అంటూ కలెక్టర్ తెలిపారు. ముందే తీర్మానాలు చేసుకుంటే అది ఏకగ్రీవం అయినట్టు కాదన్నారు. నామినేషన్లు వస్తే ఎన్నికలు ఖచ్చితంగా నిర్వహిస్తామని అందరూ పోటీ చేయాల్సిందేన్నారు. ఒక వేళ విత్ డ్రాల తర్వాత ఒక్క నామినేషన్ ఉంటే మాత్రం ఏకగ్రీవం అయినట్టుగా ధృవీకరిస్తామన్నారు.
ఎస్పీ అఖిల్ మహాజన్(SP Akhil Mahajan) సైతం దీనిపై క్లారిటీ ఇచ్చారు. ముందే తీర్మానం చేయడం, బలవంతంగా ఒప్పించడం, డబ్బులు చేతులు మారడం… వేలం వేసినట్టు తెలిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారాయన…