కొండ‌గ‌ట్టులో అగ్ని ప్ర‌మాదం

Fire accident in Kondagattu:కొండగట్టులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. శ‌నివారంరాత్రి 11 గంటల సమయంలో పట్టణంలోని ఓ బొమ్మల దుకాణంలో మంటలు చెలరేగాయి. ఆ మంటలు పక్క షాపులకు కూడా వ్యాపించడంతో మొత్తం 32 షాపులు పూర్తిగా దగ్ధమై భారీ ఎత్తున మంటలు, పొగలు చెలరేగాయి. దీంతో స్థానికులు భయభ్రాంతులై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను ఆర్పివేశారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. పట్టణంలోని కొండగట్టు స్టేజీ వద్ద ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకోగా.. హనుమాన్‌ విగ్రహం నుంచి కరీంనగర్‌-జగిత్యాల ప్రధాన రహదారి వరకు ఉన్న మొత్తం 32 బొమ్మల షాపులు దగ్ధమయ్యాయి. దీంతో షాపుల్లోని సామాగ్రి మొత్తం కాలి బూడిదవ్వడంతో భారీగా ఆస్తి నష్టం చేకూరింది. ఒక్కో షాపులో రూ.8 నుంచి రూ.10 లక్షల విలువైన సామాగ్రి దగ్థమైనట్లు అధికారులు అంచనా వేశారు. దీంతో ఈ అగ్నిప్రమాదంతో రూ.కోటి వరకు ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.

ఫైర్ సిబ్బంది 12 గంటలకు చేరుకోగా.. అప్పటికే దుకాణాలు అన్నీ పూర్తిగా దగ్ధమయ్యాయి. భారీగా ఆస్తి నష్టం జరగడంతో వ్యాపారులు లబోదిబోమంటున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపడుతున్నారు. ఒక షాపులో షార్ట్ సర్కూట్ అవ్వడం వల్లనే ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మల్యాల సీఐ రవి, ధర్మపురి సీఐ రాంనర్సింహారెడ్డిలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. దీనిపై కేసు నమోదు చేసుకుని అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like