రాష్ట్రం, దేశాన్ని కొంటారు..? అమ్మేద్దామా…?
Minister Jupalli Krishna Rao:తాను అర్రాసు ఏకగ్రీవాలకు వ్యతిరేకమని మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupalli Krishna Rao) అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) పర్యటన ఏర్పాట్ల కోసం ఆదిలాబాద్ జిల్లాకు వచ్చిన ఆయన మాట్లాడారు. ప్రేమ, సేవా భావంతో ఏకగ్రీవంగా పట్టం కడితే స్వాగతిస్తామని తెలిపారు. కానీ డబ్బున్న వాళ్లు పదవులు, అర్రాస్ పెట్టి కొనుక్కుంటే అటువంటి వారిని ప్రజాప్రతినిధులుగా గుర్తించనని, అలాంటి వాటికి తాను వ్యతిరేమన్నారు. డబ్బున్న వాళ్లు రాష్ట్రం దేశాన్ని కొంటారు..? అమ్మేద్దామా…? అని ఆయన ప్రశ్నించారు.
కేసీఆర్ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు 22 మంది సీఎం లు ఎంత అప్పు చేశారో అంతకు పదింతల అప్పు కేసిఆర్ చేశారని దుయ్యబట్టారు. జూబ్లీహిల్స్ ఎన్నికలే రెఫరెండం అని కేటీఆర్ అన్నారని, ప్రజలు తమ అభిప్రాయం చెప్పారని స్పష్టం చేశారు. కోట్ల రూపాయలు సంపాధించిన డబ్బుతో సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ నాయకుల ప్రతిష్టను దిగజార్చే విధంగా చేశారు..అయినా జనం మావైపే తీర్పు ఇచ్చారని మంత్రి స్పష్టం చేశారు.
సర్పంచ్ ఎన్నికలు పార్టీ రహితంగా జరిగినా మా మద్దతుదారులు భారీ సంఖ్యలో గెలవబోతున్నారని ఆయన వెల్లడించారు. ఇక ముందు ఏ ఎన్నికలు జరిగినా గెలిచేది కాంగ్రెస్ పార్టీనేనని జూపల్లి స్పష్టం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు ఈ రాష్ట్రంలో అవకాశం లేదని తెలిపారు. వచ్చే ఐదేళ్లు సైతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటదన్నారు.