సింగరేణి విజన్ 2047
Singareni:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విజన్ 2047 కు అనుబంధంగా సింగరేణి(Singareni) కూడా తన విజన్ 2030-2047 డాక్యుమెంట్ ప్రకటించింది. హైదరాబాద్ సింగరేణి భవన్ లో సీఎండీ బలరామ్ విజన్ డాక్యుమెంట్ విడుదల చేశారు. సింగరేణి సంస్థ భవిష్యత్తుతో పాటు రాష్ట్ర, దేశ అవసరాలకు అనుగుణంగా కంపెనీని బొగ్గు రంగంతో పాటు ఇతర రంగాల్లోకి పెద్ద ఎత్తున విస్తరించేలా ప్రణాళికలు రూపొందించారు. వివిధ రకాల పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తి భారీ ఎత్తున ప్రణాళికలు తయారు చేశారు. దేశవిదేశాల్లో కీలక ఖనిజరంగంలో ప్రవేశించడానికి సింగరేణికి అనుబంధంగా గ్లోబల్ సింగరేణి లిమిటెడ్ ఏర్పాటు చేయనున్నారు.
-సింగరేణి సంస్థ 2030 నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
-దీని కోసం ప్రస్తుత లీజు ప్రాంతంలోనే కాక, లీజుకు వెలుపల, వివిధ రాష్ట్రాల్లో ఉన్న కొత్త బ్లాకులను కూడా చేపట్టాలని నిర్ణయం తీసుకుంది.
-ప్రస్తుత 1,200 మెగావాట్ల థర్మల్ విద్యుత్తు ఉత్పాదన 4,400 మెగావాట్లకు పెంచాలని అందుకు అనుగుణంగా కొత్త ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందించింది.
-ప్రస్తుతం 245.5 మెగావాట్ల సోలార్ విద్యుత్ ను ఉత్పత్తి చేస్తోన్న సింగరేణి 2030 నాటికి 2,000 మెగావాట్ల సోలార్ విద్యుత్తు ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా రాజస్థాన్ లో త్వరలోనే 1,500 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది.
-రాష్ట్రంలోని పలు భారీ నీటి జలాశయాల పైన 800 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది.
-ఎత్తైన ఓపెన్ కాస్ట్ డంపుల పైన 100 మెగావాట్ల పవన విద్యుత్తు ఉత్పత్తి కోసం ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది.
-500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకున్న కంపెనీ తొలి దశలో మూతబడిన మేడిపల్లి ఓపెన్ కాస్ట్ గని వద్ద 250 మెగావాట్ల ప్లాంటును ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
-మణుగూరు పగిడేరు వద్ద ప్రయోగాత్మకంగా విజయవంతమైన జియో థర్మల్ ప్లాంటు వద్ద 200 మెగావాట్ల జియో థర్మల్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. ఎఫ్.డి.ఆర్.ఈ హైబ్రిడ్ ఆర్టీసి విభాగాలలో కలిపి మరో 1,500 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయాలని, 700 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టం లను వివిధ సోలార్ ప్లాంట్ల వద్ద ఏర్పాటు చేయాలని కూడా ప్రణాళికలు రూపొందించింది. దీనితో మొత్తం మీద 2029 – 30 నాటికి సింగరేణి 5.85 గిగా వాట్ల(5,850 మెగావాట్ల) పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తి చేయాలని విజన్ డాక్యుమెంట్ లో స్పష్టం చేసింది.
సింగరేణి కేవలం బొగ్గు, థర్మల్ విద్యుత్, పవన విద్యుత్, సోలార్ విద్యుత్ రంగాలలోనే కాకుండా కీలక ఖనిజ రంగంలోకి ప్రవేశించాలని నిర్ణయించింది. ఈ మేరకు దేశ విదేశాల్లో ఈ రంగంలో గల అవకాశాలను పరిశీలించడం కోసం ప్రఖ్యాత పరిశోధన సంస్థలతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. రాగి, బంగారం అన్వేషణకు లైసెన్స్ కూడా సాధించింది. ఇక ముందు కూడా ఈ రంగంలో దూకుడుగా ముందుకు పోవాలని నిర్ణయించింది. అంతర్జాతీయ స్థాయిలో ఇటువంటి కార్యకలాపాలు నిర్వహించడానికి సింగరేణికి అనుబంధంగా గ్లోబల్ సింగరేణి లిమిటెడ్ (జి.ఎస్.ఎల్)అనే అనుబంధ సంస్థ ఏర్పాటు విజన్ డాక్యుమెంట్ లో సూచించారు.
2047లో అవసరమయ్యే థర్మల్ విద్యుత్తు, 5,000 మెగావాట్ల సోలార్ విద్యుత్తు, 2815 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్, 1,500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ పవర్ ప్లాంట్లను, 500 మెగావాట్ల జియో థర్మల్ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. మొత్తం మీద 25 గిగావాట్ల పరిమాణంలో వివిధ రకాల పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తి చేయాలని విజన్ డాక్యుమెంట్ లో పేర్కొంది.
-సింగరేణి రక్షణతో కూడిన ఉత్పాదకత గల ఆధునిక టెక్నాలజీలతో బొగ్గు ఉత్పత్తులు సాధిస్తుంది.
-పర్యావరణహిత, మైనింగ్ చేపడుతూ, జల సంరక్షణకు, జీవ వైవిధ్యానికి, వాతావరణ కాలుష్య నివారణకు పాటు పడుతుంది.
-పూర్తి పారదర్శకంగా నీతి, నిజాయితీలతో ప్రజావసరాలను దృష్టిలో ఉంచుకొని మైనింగ్ జరుగుతుంది.
-వాతావరణ కాలుష్య నివారణ కోసం కోల్ వాషరీలను ఏర్పాటు చేస్తుంది.
-కోల్ గ్యాసిఫికేషన్, లిక్విఫికేషన్ ప్రణాళికలు అమలు చేస్తుంది.
-కర్బన ఉద్గారాలను అదుపు చేస్తూ వాటితో ఉపయోగకర పదార్థాలను తయారుచేస్తుంది.
-వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా సౌర విద్యుత్తు, పవన విద్యుత్తు, ఫ్లోటింగ్ సోలార్ వంటి ప్లాంట్లు ఏర్పాటుచేస్తుంది.
-రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ రంగంలో ప్రవేశిస్తుంది.
-బొగ్గు నుంచి రసాయనాలు, కోల్ గ్యాసిఫికేషన్ ఆధారిత ఉత్పత్తులు సాధిస్తుంది.
-మూతపడిన గనుల్లో రిక్లేమేషన్ పనులతో పాటు, అక్కడ ఉన్న నీటి వసతులను పంప్డ్ హైడ్రో ప్రాజెక్టుల కోసం వినియోగిస్తుంది.
-మెటల్ మైనింగ్ రంగంలో అన్వేషణ విభాగపు సేవలు అందిస్తుంది.
అనేక కార్మిక ప్రయోజన, ప్రజాహిత చర్యలు
-నూతన టెక్నాలజీకి అనుగుణంగా ఆటోమేషన్ పద్ధతులకు తగిన విధంగా ఉద్యోగులకు శిక్షణలు ఇవ్వడం.
-ఉద్యోగులకు గట్టి ఆరోగ్య రక్షణ, భద్రత , సంక్షేమ కార్యక్రమాలు.
-సామాజిక బాధ్యత కార్యక్రమాల ద్వారా ఉపాధి అవకాశాల పెంపుదల.
-మహిళా ఉద్యోగుల సేవలను ఓపెన్ కాస్ట్ భూగర్భగనుల్లోని కీలక విభాగాల్లో వినియోగించడం వంటి చర్యలను విజన్ డాక్యుమెంట్ లో పేర్కొన్నారు