అంత‌ర్జాతీయ వేదిక‌కు అంతా సిద్ధం

Global Summit 2025 :తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కోసం సర్వం సిద్ధమైంది. తెలంగాణ ప్ర‌భుత్వం ఈ స‌మ్మిట్ 8, 9 తేదీల్లో ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేసింది. సమ్మిట్ కోసం మొత్తం ఆరు ఖండాలకు చెందిన 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు వస్తున్నారు. 8న మధ్యాహ్నం 1.30గంటల సమయంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ సమ్మిట్ ను ప్రారంభిస్తారు. 9వ తేదీ సాయంత్రం 6 గంటలకు సమ్మిట్ ముగియ‌నుంది. 2047 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను మూడు ట్రిలియన్ డాలర్ల స్థాయికి పెంచాలనే లక్ష్యంతో ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కోసం 500 ఎకరాల్లో ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 2వేల మంది కూర్చునేలా ప్రారంభ వేదికను సిద్ధం చేశారు. ప్యానల్ చర్చల కోసం ఆరు సెషన్ హాళ్లు సిద్ధం చేశారు. సీఎం, ప్రముఖుల కోసం ఎంఐపీ హాల్ ఏర్పాటు చేశారు. వివిధ పథకాల ప్రదర్శనకు వీడియో టన్నెల్ సిద్ధం చేశారు.

వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో స్టాళ్లను ఏర్పాటు చేశారు. వీటిలో ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాలను ప్రదర్శించనున్నారు. సుమారు 50 ప్రతిష్టాత్మక సంస్థలు, పలు రంగాల్లో ఈ మేరకు పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు చేసుకోనున్నాయి. ఈ ఒప్పందాలకు సంబంధించిన ప్రకటనలన్నీ కూడా తెలంగాణ రైజింగ్ సమ్మిట్ సందర్భంగా వెలువడనున్నాయి. ఇప్పటికే 14 కంపెనీలు.. లక్ష కోట్ల పెట్టుబడులపై ప్రభుత్వంతో అవగాహన ఏర్పర్చుకున్నాయి.

భారత్ ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ కోసం జరుగుతున్న ఏర్పాట్లను సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. ప్రాంగణంలో వేదికలు, ఇతర నిర్మాణ పనులన్నీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అక్కడ జరుగుతున్న పనుల పురోగతిపై అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. సదుపాయాల్లో ఎలాంటి లోటు రావొద్దని ఆదేశించారు. సమ్మిట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. మూసీ పునరుజ్జీవనంపై ఏర్పాటు చేసిన డిజిటల్ చిత్రాలను సీఎం పరిశీలించారు.

అంత‌ర్జాతీయ కంపెనీల‌కు చెందిన ప్ర‌తినిధులు, కేంద్ర మంత్రులు, ప‌లు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, మంత్రులు, వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు స‌మ్మిట్‌కు హాజ‌ర‌వుతున్నందున వారికి స్వాగ‌త ఏర్పాట్లు, వ‌స‌తి, ఇత‌ర స‌దుపాయాల విష‌యంలో త‌గు జాగ్ర‌త్త‌లు వ‌హించాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌కు సూచించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like