ఆదిలాబాద్ గజగజ
ఆదిలాబాద్ జిల్లా చలికి వణికిపోతోంది. రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోవడం, కేవలం సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తరాది నుండి వీస్తున్న చలిగాలులతో అడవుల జిల్లా ఆదిలాబాద్ వణికిపోతున్నది. నిన్న, మొన్నటి వరకు సాధారణ ఉష్ణోగ్రతలే నమోదు కాగా… ఆదివారం ఉదయం అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ఉట్నూర్, బోథ్ ఏజెన్సీ ప్రాంతాల్లో దట్టమైన పొగ మంచు కమ్ముకున్నాయి. దీంతో వాహన రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి.
గిన్నెధరి 6.6..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చాలా చోట్ల కేవలం సింగిల్ డిజిట్‌కే ఉష్ణోగ్రతలు పరిమితం అయ్యాయి. దీంతో ఏజెన్సీని మంచు దుప్పటి కమ్మేసింది. రికార్డు స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు పడిపోవడంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో కొమురం భీమ్ జిల్లా గిన్నెధరిలో 6.6 గా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా అర్లిటీలో 6.8, నిర్మల్ జిల్లా పెంబిలో 9 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా కోటపల్లిలో 10.4 గా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.