సింగరేణి అధికారుల సమస్యలకు గ్రీన్ సిగ్నల్

Singareni:సింగరేణిలో విధులు నిర్వహిస్తున్న సుమారు 2,200 మంది అధికారుల సమస్యల పరిష్కారంపై వీలైనంత త్వరగా సానుకూల నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. కోల్ ఇండియా సంస్థల్లో అమలవుతున్న విధానాల మాదిరిగా అధికారుల వేతన సవరణతో పాటు పర్‌ఫార్మెన్స్ రిలేటెడ్ పేమెంట్ (PRP) అమలుకు సంబంధించిన విజ్ఞప్తులను ప్రాధాన్యంగా పరిగణించి త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్‌కు మైనింగ్ లీజు మంజూరులో కీలక పాత్ర పోషించినందుకు కృతజ్ఞతలు తెలిపేందుకు సింగరేణి అధికార సంఘం నాయకులు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిశారు. ఈ సందర్భంగా అధికారుల సమస్యలను త్వరగా పరిష్కరించేలా సింగరేణి యాజమాన్యానికి ఆదేశాలు ఇవ్వాలని వారు కోరారు.స్పందించిన భట్టి విక్రమార్క సోమవారం సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి, డైరెక్టర్ (పర్సనల్ & ఫైనాన్స్) గౌతమ్ పోట్రుతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి ఇంధన భద్రత కల్పించడంలో సింగరేణి కార్మికులు, అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

అధికారుల్లో అసంతృప్తి నెలకొనకుండా వారి సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని, అధికార సంఘం నాయకులతో చర్చించి వారికి భరోసా కల్పించాలని యాజమాన్యాన్ని ఆదేశించారు. ఎలాంటి జాప్యం లేకుండా రానున్న రెండు నుంచి మూడు నెలల్లో అధికారుల విజ్ఞప్తులపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు.

అదేవిధంగా, ప్రపంచీకరణ పరిస్థితులు, పెరుగుతున్న పోటీని దృష్టిలో ఉంచుకుని బొగ్గు ఉత్పత్తి, విక్రయాల్లో సింగరేణి పోటీతత్వాన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్తులో సింగరేణిని బహుముఖ రంగాల్లో విస్తరించి అంతర్జాతీయ స్థాయి సంస్థగా తీర్చిదిద్దేందుకు అధికారులు కీలక పాత్ర పోషించాలని, అధికార సంఘం నాయకులు కూడా అధికారుల్లో సానుకూల దృక్పథం, కార్యోన్ముఖత పెంపొందించేలా కృషి చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సింగరేణి అభివృద్ధి, కొత్త బొగ్గు బ్లాక్‌ల సాధన కోసం చేస్తున్న కృషికి సింగరేణి అధికార సంఘం అధ్యక్షుడు తాళ్లపల్లి లక్ష్మీపతి గౌడ్, ప్రధాన కార్యదర్శి పెద్ది నరసింహులు కృతజ్ఞతలు తెలిపారు. తమ సమస్యల పరిష్కారంపై ఉప ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేయడంపై ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. సింగరేణి అభివృద్ధి, విస్తరణ, సుస్థిర భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రతి కార్యక్రమానికి అధికారుల తరఫున సంపూర్ణ మద్దతు అందిస్తామని, సంస్థ పురోగతికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని వారు పేర్కొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like