సింగరేణికి అండగా కేంద్రం నిలుస్తుంది
Singareni:సింగరేణి సంస్థను బలోపేతం చేయడం, కార్మికుల సంక్షేమాన్ని కాపాడడంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి(Union Minister of Coal and Mines Kishan Reddy) స్పష్టం చేశారు. ‘సింగరేణి భరోసా యాత్ర'(‘Singareni Bharosa Yatra’)లో భాగంగా కొత్తగూడెం క్లబ్‌లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రూ.2.60 లక్షల కోట్ల కోల్ కుంభకోణం జరిగిందన్నారు. అప్పటి నుంచి సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం దేశంలో బొగ్గు బ్లాకుల కేటాయింపు వేలం ద్వారానే జరుగుతోందన్నారు. తెలంగాణపై ప్రత్యేక దృష్టితో సుమారు 11 ఏళ్ల తర్వాత ఎలాంటి వేలం నిర్వహించకుండా తాడిచర్ల–II బొగ్గు బ్లాక్(Tadicherla-II Coal Block) నేరుగా సింగరేణికి కేటాయించినట్లు తెలిపారు. దీంతో రాబోయే 40 నుంచి 50 సంవత్సరాల వరకు బొగ్గు ఉత్పత్తికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాల కారణంగా సింగరేణి ఆదాయం తగ్గడంతో పాటు ఉద్యోగుల సంఖ్య 70 వేల నుంచి 40 వేలకు పడిపోయిందని ఆరోపించారు. తాడిచర్ల–II, ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్‌లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు సంస్థ భవిష్యత్తుకు, కార్మికుల ఉపాధికి భరోసానిచ్చాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ సంస్థలకు బొగ్గు సరఫరా చేస్తున్నా, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణికి చెల్లించాల్సిన బకాయిలను విడుదల చేయకపోవడంతో సంస్థ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని కిషన్‌రెడ్డి విమర్శించారు. ఈ రెండు ప్రభుత్వాలు కలిసి సుమారు రూ.50 వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని ఆరోపించారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు, కార్మికులకు అండగా నిలిచిందని తెలిపారు.
సింగరేణి అభివృద్ధి, కార్మికుల సంక్షేమం కోసం సహకరిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ ప్రజల తరఫున, సింగరేణి కార్మికుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నరపరాజు రామచందర్‌రావు, ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ధన్‌పాల్ సూర్యనారాయణ, రామారావు పాటిల్‌తో పాటు బీజేపీ నాయకులు, సింగరేణి కార్మికులు పాల్గొన్నారు.