ఆరు హత్యలు చేసి ఆత్మహత్య
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన షాబాద్ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ మృతదేహాన్ని రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పంజర్ల సమీపంలో గుర్తించారు. మృతదేహం పక్కనే విషం బాటిల్ లభ్యమవడంతో అతడు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు.
మూడు రోజుల క్రితం షాబాద్ మండలంలో రాజ్‌కుమార్ అత్యంత దారుణంగా ఆరుగురిని హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. తన భార్య పార్వతి సరిత (30), కుమారులు పరీక్షిత్ (3), దైవిక్షిత్ (2)తో పాటు చిట్యాల రుక్కమ్మ (65), ఆమె కుమార్తె లక్ష్మీ (45), 17 ఏళ్ల బాలికను హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఘటన అనంతరం నిందితుడు తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి తానే ఆరుగురిని హత్య చేసినట్లు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం పరారైన రాజ్‌కుమార్ కోసం తెలంగాణతో పాటు బెంగళూరులోనూ ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించడంతో పాటు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ సహాయంతో దర్యాప్తు కొనసాగించారు. అతడి ఆచూకీ తెలిపిన వారికి రూ.2 లక్షల నగదు బహుమతి కూడా ప్రకటించారు.
తాజాగా కొత్తూరు మండలం పంజర్ల సమీపంలో రాజ్‌కుమార్ మృతదేహం లభ్యమవడంతో గాలింపు చర్యలకు తెరపడింది. అయితే అతడి మరణానికి గల కారణాలు, అది నిజంగా ఆత్మహత్యేనా..? లేదా అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.