రాష్ట్రంలో మంచిర్యాల నంబర్-1

నాంది న్యూస్, మంచిర్యాల:ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంపులో మంచిర్యాల జిల్లా రాష్ట్రంలోనే తొలి స్థానంలో నిలిచి మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన 10 శాతం అదనపు విద్యార్థుల నమోదు లక్ష్యంలో ఇప్పటికే 95.72 శాతం సాధించి అన్ని జిల్లాలకు ఆదర్శంగా నిలిచింది. ప్రభుత్వ విద్యపై తల్లిదండ్రుల విశ్వాసం రోజురోజుకూ పెరుగుతుండటమే ఈ విజయానికి ప్రధాన కారణంగా అధికారులు పేర్కొంటున్నారు.

2025-26 విద్యా సంవత్సరంలో జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో 43,072 మంది విద్యార్థులు ఉండగా, 2026-27 విద్యా సంవత్సరానికి 47,379 మంది నమోదు లక్ష్యంగా నిర్ణయించారు. ప్రస్తుతం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 45,350 మంది విద్యార్థులు నమోదు కావడంతో గత ఏడాదితో పోలిస్తే 2,278 మంది అదనంగా చేరారు. దీంతో లక్ష్య సాధనలో మంచిర్యాల జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా రెండో స్థానం, జగిత్యాల జిల్లా మూడో స్థానంలో నిలిచాయి.

జిల్లాలోని 275 ప్రభుత్వ పాఠశాలలు గత ఏడాదికంటే ఈసారి 10 శాతానికి పైగా అదనపు విద్యార్థుల నమోదును సాధించడం విశేషం. మండలాల వారీగా మందమర్రి, జైపూర్ మండలాలు 100 శాతం లక్ష్యాన్ని పూర్తి చేయగా, హాజీపూర్ (99.91%), నస్పూర్ (99.76%), భీమారం (98.24%), నెన్నెల (98%) అత్యుత్తమ ప్రగతి నమోదు చేశాయి. మొత్తం 18 మండలాల్లో 10 మండలాలు 96 నుంచి 100 శాతం వరకు లక్ష్యాన్ని చేరుకున్నాయి.

ఇక జూలై 23 నాటి యూ-డైస్ గణాంకాల ప్రకారం జిల్లాలో 3,352 మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలను వీడి ప్రభుత్వ పాఠశాలల్లో చేరడం గమనార్హం. ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులోకి వచ్చిన నాణ్యమైన బోధన, మెరుగైన మౌలిక సదుపాయాలు, డిజిటల్ విద్యా వసతులు, విద్యార్థి కేంద్రిత కార్యక్రమాలే ఇందుకు ప్రధాన కారణమని అధికారులు భావిస్తున్నారు.

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ (స్మార్ట్ టీవీలు), ఐసీటీ కంప్యూటర్ ల్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లతో డిజిటల్ విద్యను అందిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలో 82 పాఠశాలల్లో కంప్యూటర్ బోధకులను నియమించారు. విద్యా ప్రమాణాల మెరుగుదలకు 8 అకాడమిక్ పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేసి పాఠశాలల పనితీరును నిరంతరం సమీక్షిస్తున్నారు.

బాలికలకు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉచిత రెసిడెన్షియల్ విద్య అందుబాటులో ఉందని అధికారులు తెలిపారు. అలాగే ప్రతి ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాల నుంచి తదుపరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను ప్రధానోపాధ్యాయులే స్వయంగా పర్యవేక్షించే విధంగా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.

ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో పెరుగుతున్న నమ్మకం, జిల్లా యంత్రాంగం తీసుకున్న ప్రత్యేక చర్యలు, ఉపాధ్యాయుల కృషి ఫలితంగానే ఈ విజయాన్ని సాధించామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు అన్ని మౌలిక వసతులు అందుబాటులో ఉన్నందున తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like