సింగరేణిపై INTUC కీలక తీర్మానాలు..!
INTUC:సింగరేణి సంస్థ భవిష్యత్ అభివృద్ధి, కార్మికుల హక్కుల పరిరక్షణ, వేతన సవరణ వంటి కీలక అంశాలపై ఐఎన్టీయూసీ కోర్ కమిటీ కీలక సమావేశం నిర్వహించింది. 12వ జేబీసీసీఐ వేజ్ బోర్డు ఏర్పాటు, కొత్త బొగ్గు గనుల సాధన, తాడిచర్ల-2 ప్రాజెక్టు వేగవంతం చేయడం వంటి అంశాలపై పలు కీలక తీర్మానాలు చేసింది.
సింగరేణి సంస్థలో ప్రస్తుత పరిస్థితులు, సంస్థ భవిష్యత్ కార్యాచరణ, కార్మికుల సంక్షేమంపై చర్చించేందుకు ఐఎన్టీయూసీ కోర్ కమిటీ సమావేశమైంది. ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ డాక్టర్ బి. జనక్ ప్రసాద్ అధ్యక్షతన ఆయన నివాసంలో జరిగిన ఈ సమావేశంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. సమావేశంలో అత్యంత కీలకంగా 12వ జేబీసీసీఐ వేజ్ బోర్డు అంశంపై చర్చించారు. కార్మికుల వేతన సవరణ ప్రక్రియను ఆలస్యం చేయకుండా వెంటనే వేజ్ బోర్డును ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.
సింగరేణి విస్తరణకు అవసరమైన కొత్త బొగ్గు బ్లాకుల సాధన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చర్యలు చేపట్టాలని సమావేశం అభిప్రాయపడింది. ముఖ్యంగా తాడిచర్ల-2 ప్రాజెక్టును వేగవంతం చేయడం ద్వారా సంస్థ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని నేతలు సూచించారు. కార్మికుల పెండింగ్ హామీలు, పర్క్స్పై ఆదాయపు పన్ను మినహాయింపు, సొంత ఇంటి పథకం, మారుపేర్లు, విజిలెన్స్ సమస్యలు, కాంట్రాక్ట్ కార్మికుల ఇబ్బందులు, గనుల్లో భద్రతా ప్రమాణాల మెరుగుదల వంటి అంశాలపై కూడా సమగ్రంగా చర్చించారు.
సింగరేణి విస్తరణ ద్వారా యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించడంపై కూడా సమావేశంలో ప్రత్యేక దృష్టి సారించారు. యూనియన్ కార్యకర్తలకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం, హైదరాబాద్లో జరగనున్న మహాసభలకు సన్నాహాలు చేయడం, అన్ని ఏరియాల్లో అవగాహన సమావేశాలు నిర్వహించడం వంటి కార్యాచరణను ఖరారు చేశారు. అవసరమైతే కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలకు కూడా సిద్ధంగా ఉండాలని సమావేశం నిర్ణయించింది.
ఈ సమావేశంలో జనక్ ప్రసాద్ తో పాటు ఐఎన్టీయూసీ నేతలు నరసింహరెడ్డి, ధర్మపురి, కాంపెల్లి సమ్మయ్య, త్యాగరాజన్, జెట్టి శంకర్ రావు, వికాస్ కుమార్ యాదవ్, రామిశెట్టి నరేందర్, రఘుపతి రెడ్డి, జోగ బూచయ్య, వడ్డేపల్లి దాస్, లక్ష్మిపతి గౌడ్, పశునుటి రాజేందర్, ఎం.డి. అక్రమ్, ఏనుగు రవీందర్ రెడ్డి, జీవన్ జోయల్, కలవెన శ్యామ్, శేషారత్నం, ఆరేపల్లి శ్రీనివాస్, అల్బర్ట్, సదానందం (RG-1), సత్యనారాయణ రెడ్డి (RG-2), రవీందర్ రెడ్డి (RG-3), మధుకర్ రెడ్డి (BHPL), దేవి భూమయ్య (MM), పేరం శ్రీనివాస్ (BPL), రజాక్ (KGM), పేతాంబర్ రావు (COR), జే. వెంకటేశ్వర్లు (YDL), కృష్ణంరాజు (MNR), కోటేశ్వర్ రావు (STP), క్రాంతి కుమార్, పేరం రమేష్, గరిగే స్వామి, తిరుపతి రాజు, రాపర్తి శ్రీనివాస్, లలిత తదితరులు పాల్గొని పలు కీలక అంశాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.