తాడిచర్ల -2 వేగవంతం చేయండి
తెలంగాణ అభివృద్ధి, యువతకు ఉపాధి, సింగరేణి కార్మికుల సంక్షేమం, తాడిచర్ల-2 బొగ్గు గని ప్రాజెక్టు వేగవంతంపై కేంద్ర మంత్రులతో రాష్ట్ర మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కీలక భేటీలు నిర్వహించారు. పలు అంశాలపై వినతిపత్రాలు సమర్పిస్తూ కేంద్ర సహకారం కోరారు. న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ముందుగా కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయాను కలిశారు. తెలంగాణలో కార్మిక సంక్షేమ కార్యక్రమాల విస్తరణ, మరిన్ని ఉపాధి అవకాశాల కల్పన, కేంద్ర పథకాల సమర్థవంతమైన అమలుకు అదనపు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
అనంతరం కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత శాఖ మంత్రి జయంత్ చౌదరిని కలిసి యువతకు ఆధునిక సాంకేతిక నైపుణ్య శిక్షణ, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటు, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాల విస్తరణపై చర్చించారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డితో జరిగిన సమావేశంలో పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని తాడిచర్ల-2 బొగ్గు గని ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలని కోరారు. ప్రాజెక్టు ప్రభావిత గ్రామాల స్థానిక యువతకు ప్రాధాన్యత ఇస్తూ కనీసం వెయ్యి ఉద్యోగాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. నిర్వాసిత కుటుంబాలకు పునరావాస, పునర్నిర్మాణ ప్యాకేజీని పూర్తిస్థాయిలో అమలు చేయాలని కూడా కోరారు.
సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులకు నెలకు కనీసం పది వేల రూపాయల పెన్షన్ అందించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మంత్రి, ఎంపీ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం తక్కువ పెన్షన్‌తో వేలాది మంది మాజీ ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేంద్ర మంత్రికి వివరించారు. అలాగే సింగరేణి విస్తరణ, కొత్త బొగ్గు గనుల అభివృద్ధి, మైనింగ్ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం సహకరించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలిస్తామని కేంద్ర మంత్రులు హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి వెంకటస్వామి మాట్లడుతూ తెలంగాణ అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాల విస్తరణ, కార్మిక సంక్షేమం, మైనింగ్ రంగ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయంగా పనిచేస్తామన్నారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు సంబంధించిన ప్రతి అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తూ వాటి సాధన కోసం నిరంతరం కృషి చేస్తామని స్పష్టం చేశారు.