భారీ వర్షాలతో అప్రమత్తం..

మంచిర్యాలలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ యంత్రాంగం అప్రమత్తమైంది. నీటి నిల్వలు, పొంగిపొర్లుతున్న డ్రైనేజీలు, వాగులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మేయర్ దర్ని మధుకర్ వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భారీ వర్షాల ప్రభావంతో నీటి నిల్వలు ఏర్పడిన ప్రాంతాలను మేయర్ బుధ‌వారం పరిశీలించారు. వర్షపు నీరు నిలిచిన రహదారులు, డ్రైనేజీల పరిస్థితిని స్వయంగా పరిశీలించి, నీటి పారుదల సక్రమంగా జరిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. 9వ డివిజన్ తిరుమల టౌన్‌షిప్‌తో పాటు 32వ డివిజన్ రాంనగర్ ఆదిపరాశక్తి దేవాలయం సమీపంలోని వాగులు, డ్రైనేజీలు భారీ వర్షాల కారణంగా పొంగిపొర్లడంతో జేసీబీ సహాయంతో నీటి ప్రవాహాన్ని మళ్లించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని వెంటనే తొలగించి, నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలని మేయర్ అధికారుల‌ను ఆదేశించారు. వర్షాకాలంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు వేగంగా సేవలు అందించేలా అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు. మున్సిపల్ సిబ్బంది ప్రజల ఫిర్యాదులకు వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని, నగరంలో ఎక్కడా నీటి నిల్వలు లేకుండా నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని మేయర్ దర్ని మధుకర్ పేర్కొన్నారు.

 

You might also like