తెల్లోడి పైకి తొలి ఆదివాసీ బాణం

ఆదివాసీ సమాజాల చరిత్ర, సంస్కృతి, స్వాభిమానం, దేశ నిర్మాణంలో వారి పాత్రను యావత్ భారతదేశం గుర్తుచేసుకునే ప్రత్యేక సందర్భం. కేవలం 24 ఏళ్ల వయసులోనే బ్రిటిష్ పాలకులకు సింహస్వప్నంగా మారి, తన ప్రాణాలను బలిదానం చేసిన అడవి బిడ్డ.. గిరిజన సూర్యుడు బిర్సా ముండా 151వ జయంతి నేడు. ఉలిహటు అనే ఒక చిన్న గ్రామంలో పుట్టిన బిర్సా.. ‘భగవాన్’ గా ఎలా మారారు…? ఆయన సాగించిన ‘ఉల్గులన్’ పోరాటం నేటి తరానికి ఎలాంటి స్ఫూర్తినిస్తోంది..? ఆ గిరిజ‌న వీరుడి గురించి ”నాంది న్యూస్” ప్రత్యేక కథనం…

ప్రస్తుత జార్ఖండ్ రాష్ట్రంలోని ఖుంటి జిల్లా ఉలిహటు గ్రామం. 1875 నవంబర్ 15న ఒక నిరుపేద ముండా ఆదివాసీ కుటుంబంలో జన్మించారు బిర్సా ముండా. చిన్ననాటి నుంచే అడుగడుగునా సామాజిక వివక్షను ఎదుర్కొన్నారు. బ్రిటిష్ పాలన విస్తరిస్తున్న ఆ రోజుల్లో.. సంప్రదాయ ఆదివాసీ భూములపై బయటి వ్యక్తుల ఆధిపత్యం పెరిగిపోయింది. భూస్వాములు, వడ్డీ వ్యాపారులు, కాంట్రాక్టర్ల దోపిడీకి గిరిజనుల బతుకులు చితికిపోయాయి. అప్పుల ఊబి, వెట్టిచాకిరీ, అధిక పన్నుల నడుమ నలిగిపోతున్న ఆదివాసీలను చూసి బిర్సా ముండా రక్తం మరిగిపోయింది. తమ భూమి, సంస్కృతి కాపాడుకోవాలని గిరిజన జాతికి ఆయన పిలుపునిచ్చారు.

బిర్సా ముండా పేరు వినగానే గుర్తుకొచ్చే పదం ‘ఉల్గులన్’. ముండారీ భాషలో దీని అర్థం మహా కల్లోలం లేదా మహా తిరుగుబాటు. 1899-1900 మధ్య చోటానాగ్‌పూర్ ప్రాంతంలో ఉవ్వెత్తున ఎగిసిన ఈ ఉద్యమం.. బ్రిటిష్ వలస పాలనను, స్థానిక దోపిడీదారులను గడగడలాడించింది. ఇది కేవలం ఒక నిరసన కాదు.. ఆదివాసీల భూమి హక్కులు, ఆత్మగౌరవం కోసం సాగిన సమగ్ర పోరాటం. “అబువా రాజ్” అంటే మన రాజ్యం – మన పాలన అనే నినాదాన్ని బిర్సా ముండా ప్రజల్లో బలంగా నాటారు. ఈ తిరుగుబాటు అణచివేసేందుకు బ్రిటిష్ ప్రభుత్వం కుట్ర పన్నింది. 1900 ఫిబ్రవరిలో బిర్సా ముండాను అరెస్ట్ చేసి రాంచీ జైలులో నిర్బంధించింది. అక్కడే 1900 జూన్ 9న కేవలం 24 ఏళ్ల వయసులో ఆ విప్లవ వీరుడు అమరుడయ్యాడు.

బిర్సా ముండా మరణించినా ఆయన రగిల్చిన ఉద్యమాగ్ని ఆరలేదు. ఆ పోరాట ఫలితంగానే బ్రిటిష్ ప్రభుత్వం దిగివచ్చి 1908లో “చోటానాగ్‌పూర్ కౌలు చట్టం” (CNT Act) తీసుకువచ్చింది. గిరిజనుల భూములను గిరిజనేతరులు లాక్కోకుండా ఈ చట్టం రక్షణ కల్పించింది. అందుకే బిర్సాను ఆయన అనుచరులు దైవ సమానుడిగా, ‘ధర్తీ అబా’ అంటే భూమికి తండ్రిగా ఆరాధిస్తారు. ఆయన కేవలం పోరాట యోధుడే కాదు, ఒక గొప్ప సామాజిక సంస్కర్త. మూఢ నమ్మకాలను విడనాడి, ఐక్యంగా ఉండాలని గిరిజనులకు ఉద్బోధించారు. మరోవైపు, ఆయన జన్మదినమైన నవంబర్ 15నే గిరిజనుల సుదీర్ఘ పోరాట ఫలమైన ‘జార్ఖండ్’ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది.

151 సంవత్సరాల కింద‌ట‌ బిర్సా ముండా లేవనెత్తిన ప్రశ్నలు నేటికీ సజీవమే. అభివృద్ధి పేరుతో సాగుతున్న మైనింగ్ ప్రాజెక్టుల వల్ల నేటికీ అడవి బిడ్డలు నిర్వాసితులవుతూనే ఉన్నారు. రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్, పెసా (PESA) చట్టం, అటవీ హక్కుల చట్టం వంటివి పకడ్బందీగా అమలు జరిగినప్పుడే బిర్సా ముండా ఆశయాలకు నిజమైన గౌరవం దక్కుతుంది. ఆయన చరిత్రను పాఠ్యపుస్తకాల్లో ఒక చిన్న పాఠంగా వదిలేయకుండా.. యువత ఆ పోరాట స్ఫూర్తిని అధ్యయనం చేయాలి. గిరిజన సమాజాల అస్తిత్వాన్ని, సంస్కృతిని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి.

భూమిని కాపాడుకోవడం అంటే కేవలం ఆస్తిని కాపాడుకోవడం కాదు.. ఒక సమాజపు అస్తిత్వాన్ని, భవిష్యత్తును కాపాడుకోవడం. ఈరోజు ‘జనజాతీయ గౌరవ్ దివస్’ ను జరుపుకుంటున్న మనం.. ఆయన చిత్రపటానికి పూలమాల వేయడంతో సరిపెట్టకుండా, ఆయన కలలుగన్న సామాజిక గౌరవాన్ని, ఆదివాసీ హక్కుల రక్షణను ఆచరణలోకి తీసుకురావాలి. అన్యాయాన్ని ప్రశ్నించే ప్రతి గొంతుకలోనూ బిర్సా ముండా జీవించే ఉంటారు. జోహార్ బిర్సా ముండా! జోహార్ ఆదివాసీ పోరాట స్ఫూర్తి!

You might also like