బేస్ క్యాంప్ వాచర్లకు అంతర్జాతీయ సంస్థ నుంచి అరుదైన గుర్తింపు
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ రేంజ్ పరిధిలోని మాకిడి సెక్షన్‌కు చెందిన చీలపల్లి బేస్ క్యాంప్ వాచర్లకు అరుదైన గౌరవం దక్కింది. అడవులు, వన్యప్రాణులు, జీవవైవిధ్య పరిరక్షణలో అంకితభావంతో అందిస్తున్న విశిష్ట సేవలకు గుర్తింపుగా WWF (వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్) సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎం. గౌతమ్ రెడ్డి మెమోరియల్ అవార్డు ప్రదానం చేశారు. శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో చీలపల్లి బేస్ క్యాంప్‌కు చెందిన ఐదుగురు వాచర్లు 1) రవీందర్ 2) డి.ప్రకాష్, 3) పీ.పాండురంగా, 4) పీ.శ్యాంరావు, 5) ఎండీ.జకీ ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్నారు. అవార్డుతో పాటు ఒక్కొక్కరికి రూ.5,000 నగదు ప్రోత్సాహకం, ప్రశంసాపత్రాన్ని అందజేశారు.
ప్రపంచవ్యాప్తంగా అడవులు, వన్యప్రాణులు, జీవవైవిధ్యం, సహజ వనరుల సంరక్షణ కోసం కృషి చేస్తున్న అంతర్జాతీయ సంస్థ నుంచి చీలపల్లి బేస్ క్యాంప్ వాచర్లకు ఈ గుర్తింపు లభించడం విశేషం. ఈ సందర్భంగా సిర్పూర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, అటవీ, వన్యప్రాణుల సంరక్షణలో క్షేత్రస్థాయిలో పనిచేస్తూ విశేష సేవలు అందించిన చీలపల్లి బేస్ క్యాంప్ వాచర్లు ఈ అవార్డును అందుకోవడం ఎంతో అభినందనీయమన్నారు. అదేవిధంగా కాగజ్‌నగర్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ డాక్టర్ ఏ. అప్పయ్య అవార్డు అందుకున్న ఐదుగురు బేస్ క్యాంప్ వాచర్లను ప్రత్యేకంగా అభినందించారు. అటవీ, వన్యప్రాణుల పరిరక్షణలో వారి కృషి, నిబద్ధత ఇతర సిబ్బందికి ఆదర్శంగా నిలవాలన్నారు.