ప్రాజెక్టులకు సహకారం అందించండి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆదివారం బిజీబిజీగా గడిపారు. ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, క్రీడా రంగాలకు సంబంధించిన కీలక అంశాలపై ప్రధానితో సీఎం చర్చించారు.
తెలంగాణలో పెండింగ్లో ఉన్న వివిధ సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి కేంద్ర సహకారం కోరడంతో పాటు పలు కీలక అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించినట్లు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి తెలిపారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానిని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి బృందం.. రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులు, తాగునీటి పరిస్థితులు, రైతుల ప్రయోజనాలకు సంబంధించి పలు అంశాలను వివరించారు.
తుమ్మిడిహట్టి బ్యారేజీ ఎత్తు పెంచేందుకు అనుమతి ఇవ్వాలని, దీనికోసం మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని ప్రధాని మోదీని కోరినట్లు మంత్రి తెలిపారు. ప్రాజెక్టు ఎత్తు పెంచాల్సిన అవసరాన్ని ప్రధానికి పూసగుచ్చినట్లు వివరించామని పేర్కొన్నారు. సమ్మక్క-సారక్క ప్రాజెక్ట్ కు అవసరమైన నిరభ్యంతర పత్రం (NOC) అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని చెప్పారు.
చనాక కొరాట బ్యారేజీ ప్రాజెక్టు కోసం రూ. 103 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే చాలా ప్రాజెక్టులు 70 శాతం మేర పూర్తయ్యాయని, వాటిని త్వరగా పూర్తి చేసేందుకు కేంద్రం ఆర్థికంగా సహకరించాలని కోరినట్లు వెల్లడించారు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి ఎల్లుండి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిని కలవనున్నట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. కేంద్రం ఇచ్చిన వివిధ హామీలపై కూడా ప్రధానితో చర్చలు జరిపినట్లు ఆయన పేర్కొన్నారు.
ఎల్-నినో ప్రభావం వల్ల తెలంగాణలో తలెత్తిన కరువు పరిస్థితులపై ప్రధానమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్రానికి ₹30,000 కోట్ల తక్షణ ఆర్థిక సాయం అందించాలని కోరారు. త్వరలో నిర్వహించనున్న ‘తెలంగాణ గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీటింగ్’ (Invest Telangana Global Summit), అలాగే ‘ఖేలో ఇండియా’ క్రీడలకు హాజరుకావాల్సిందిగా ప్రధాని మోదీని ఆహ్వానించారు. కేంద్ర క్రీడా, యువజన వ్యవహారాల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో పాటు తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి పాల్గొన్నారు.