పాలిథిన్ కవర్లు ధరించి విద్యార్థుల ఆందోళన

కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కళాశాల విద్యార్థులు రోడ్డెక్కారు. తమ కళాశాలకు ఇంచార్జ్ ప్రిన్సిపల్ వద్దంటూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. పాలిథిన్ కవర్లను మాస్కులుగా ధరించి ఆందోళనకు దిగిన విద్యార్థులు, పాత ప్రిన్సిపాల్ నే తిరిగి కొనసాగించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు.

కుమ్రం భీం ఆసిఫాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాలకు ఇంచార్జ్ ప్రిన్సిపల్ గా డాక్టర్ శ్రీలక్ష్మిని నియమించడంపై వైద్య విద్యార్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ గా సేవలు అందించిన డాక్టర్ లకావత్ వెంకట్ కు ప్రభుత్వం ఆదిలాబాద్ రిమ్స్ (RIMS) సూపరింటెండెంట్ గా బాధ్యతలు అప్పగించింది. ఆయన స్థానంలో డాక్టర్ శ్రీలక్ష్మిని ఇంచార్జ్ గా నియమించింది.

అయితే, ఈ నియామకాన్ని వ్యతిరేకిస్తూ వైద్య విద్యార్థులు కలెక్టరేట్ కు భారీగా చేరుకున్నారు. తలలకు పాలిథిన్ కవర్లను కట్టుకుని వినూత్నంగా తమ నిరసన గళాన్ని వినిపించారు. డాక్టర్ లకావత్ వెంకట్ హయాంలో కళాశాల ఎంతో అభివృద్ధి చెందిందని, ఇప్పుడు ఇంచార్జ్ నియామకంతో ఆ అభివృద్ధి కుంటుపడుతుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వెంటనే డాక్టర్ శ్రీలక్ష్మి ఇంచార్జ్ నియామకాన్ని రద్దు చేయాలని, కళాశాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పాత ప్రిన్సిపాల్ లకావత్ వెంకట్ నే ఇక్కడ కొనసాగించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు.

You might also like