అందుకే ఆ పుస్తకం రాశా..
తన కుటుంబం గురించి బయట జరుగుతున్న అవాస్తవాలు, అనవసర ప్రచారాలు, బాధ కలిగించే వ్యాఖ్యలపై అసలు నిజాన్ని ప్రపంచానికి చెప్పడానికే తన ఆత్మకథ రాసినట్లు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ స్పష్టం చేశారు. బిలాంగింగ్ ఎ జర్నీ ఆఫ్ లవ్ పేరుతో సోనియా రాసిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం న్యూఢిల్లీలో జరిగింది. ఈ కార్యక్రమంలో సోనియా మాట్లాడుతూ.. తన అత్త ఇందిరా గాంధీ, భర్త రాజీవ్ గాంధీ, పిల్లలు రాహుల్, ప్రియాంకలతో పాటు తన గురించి కూడా ఎన్నో కల్పిత కథలు, అవాస్తవాలు మాటలు ప్రచారంలో ఉన్నాయని తెలిపారు.
వ్యక్తిగత విషయాలను బయటపెట్టడం తనకు ఇష్టం ఉండదని.. రాహుల్, ప్రియాంక అలాగే ఒక సన్నిహిత స్నేహితురాలు ప్రోత్సహించడంతోనే చివరకు రాయడానికి అంగీకరించినట్లు వెల్లడించారు. తనకు డైరీ రాసే అలవాటు లేకపోవడం వల్ల పాత విషయాలను గుర్తుచేసుకోవడం కొంత కష్టమైందని తెలిపారు. ముఖ్యంగా ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల మరణాల వంటి బాధాకరమైన ఘట్టాలను రాస్తున్నప్పుడు తీవ్రమైన భావోద్వేగానికి లోనైనట్లు సోనియా చెప్పారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సమక్షంలో జరిగిన ఈ వేడుకకు పలువురు ఇండియా కూటమి అగ్రనేతలు హాజరయ్యారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ హాజరయ్యారు. జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, సుప్రియా సూలేతో పాటు పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు డీకే శివకుమార్, సుఖ్విందర్ సింగ్ సుఖు ఈ కార్యక్రమానికి వచ్చారు.