కేటీఆర్ సభలు పెడితేనే… ప్రభుత్వంలో కదలిక….
కేటీఆర్ సభలంటేనే తెలంగాణ ప్రభుత్వంలో వణుకు పుడుతోందని, ఆయన సభలు పెట్టినప్పుడల్లా ప్రభుత్వంలో కదలిక వస్తోందని బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. ఆయన తెలంగాణ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ అక్టోబర్ 14న గోదావరిఖనిలో సింగరేణి కార్మిక గర్జన ఏర్పాటు చేశామని.. అప్పటి వరకు సింగరేణి కార్మికులకు లాభాల వాటా ప్రకటించలేదన్నారు. లాభాల్లో వాటా ఎగ్గొట్టేందుకు ప్రభుత్వం కుట్రలు చేసిందని దుయ్యబట్టారు. కేటీఆర్ బహిరంగ సభ నేపథ్యంలో ఒక రోజు ముందు అంటే అక్టోబర్ 13న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సింగరేణి అధికారులు కూర్చుని లాభాల్లో 34 వాటా ప్రకటించారని స్పష్టం చేశారు.
నవంబర్ 1న ఆదిలాబాద్లో రైతు గర్జన పెట్టామన్నారు. దానికి రెండు రోజుల ముందు 365 కరువు మండలాలను ప్రకటించారని బాల్క సుమన్ గుర్తు చేశారు. నిర్మల్లో నవంబర్ 11న రైతుగర్జన నిర్వహిస్తే రెండు రోజుల ముందు కొడంగల్ వెళ్లి మూడు రోజులు రైతు మహాసభ పేరుతో హడావిడి చేశారన్నారు. కేటీఆర్ ఎక్కడ సభలు పెట్టినా రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వస్తోందన్నారు. తాము పెడుతున్న సభలు ఒక రకంగా పోరాటమే అన్నారు. అంబేద్కర్ చెప్పినట్టు బోధించు, సమీకరించు, పోరాడు.. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మోసాలను తెలంగాణ ప్రజలకు చెబుతున్నామని, ప్రజలకు చెబుతున్నామని, పోరాటం చేస్తున్నామన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో సైతం ఈ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.