పోలీసు సిబ్బంది పై వేటు
విధి నిర్వహణలో నిర్లక్ష్యం.. క్రమశిక్షణ ఉల్లంఘన.. పోలీస్ శాఖ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించిన సిబ్బందిపై ఉన్నతాధికారులు చర్యలకు దిగారు. బెల్లంపల్లి వన్‌టౌన్ లో పలువురి పై కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సీరియస్ అయ్యారు. ఐదుగురు సిబ్బందిని హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేయడంతో పాటు మరో తొమ్మిది మందిపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలకు ఆదేశాలు జారీ చేశారు.
బెల్లంపల్లి వన్‌టౌన్ పోలీసుల పని తీరు చర్చనీయాంశంగా మారింది. విధి నిర్వహణలో ఉండాల్సిన కొందరు సిబ్బంది బాధ్యతలను పక్కనపెట్టి ఓ ప్రైవేట్ రిసార్ట్ లో పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ డ్యాన్స్ చేశారు. ఈ వ్యవహారం పోలీస్ శాఖ క్రమశిక్షణకు, ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉండటంతో ఉన్నతాధికారులు స్పందించారు.
ఈ ఘటనపై రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా చర్యలు తీసుకున్నారు. ఐదుగురు పోలీస్ సిబ్బందిని పోలీస్ కమిషనరేట్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరో తొమ్మిది మంది సిబ్బందిపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు చేపట్టారు.
ఈ సందర్భంగా పోలీస్ సిబ్బందికి కమిషనర్ స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. పోలీస్ శాఖలో క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన విధి నిర్వహణ అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే విధుల పట్ల నిర్లక్ష్యం వహించడం సహించరాని విషయమన్నారు.
ప్రతి ఒక్కరూ వృత్తిపరమైన నిబద్ధతతో పనిచేస్తూ పోలీస్ శాఖ గౌరవ ప్రతిష్టలను కాపాడాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినా, క్రమశిక్షణ ఉల్లంఘించినా, శాఖ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించినా కఠిన చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు.