ములుగు బెటాలియన్‌లో కాల్పులు : ఎస్ఐ మృతి
ములుగు జిల్లా వెంకటాపురం ఏ 39 బెటాలియన్‌లో జరిగిన కాల్పుల్లో ఎస్ ఐ మృతి చెందాడు. ఈ ఘటనలో మరో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డాడు. మెస్ కమాండెంట్‌కి, సీఆర్‌పీఎఫ్ ఎస్ఐకి మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో వివాదం తీవ్రమై కాల్పులకు దారి తీసింది. పరస్పరం జరుపుకున్న కాల్పుల్లో సీఆర్‌పీఎప్ ఎస్ఐ ఉమేష్ చంద్ర మరణించారు. ఈ కాల్పులను అడ్డుకొనేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. గాయపిన సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ ను అధికారులు ఏటూరు నాగారం ఆసుపత్రికి తరలించారు. ఏటూరు నాగారం ఆసుపత్రిలో బాధితుడికి చికిత్స అందిస్తున్నారు.
ములుగు జిల్లాలోని వెంకటాపురం ప్రాంతంలో మావోయిస్టులను అరికట్టేందుకు ప్రభుత్వం ఏ 39 బెటాలియన్ ఏర్పాటు చేసింది. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ సమయంలో ఈ బెటాలియన్ లో మెస్ ఇంచార్జీ, సీఆర్‌పీఎప్ ఎస్ఐకి మధ్య వివాదం చోటు చేసుకొంది. ఈ సమయంలో మెస్ ఇంచార్జీ స్టీఫెన్ కు సీఆర్‌పీఎఫ్ ఎస్ఐ ఉమేష్ చంద్ర మధ్య వివాదం చోటు చేసుకొంది. ఈ వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. ఈ సమయంలో మెస్ కమాండంట్ స్టీఫెన్ సీఆర్‌పీఎఫ్ ఎస్ఐ ఉమేష్ చంద్రపై కాల్పులకు దిగాడు. ఉమేష్ చంద్ర కూడా స్టీఫెన్ పై కాల్పులు జరిపాడు. ఇరువురి మధ్య నాలుగు రౌండ్ల కాల్పులు చోటు చేసుకొన్నాయి.ఈ కాల్పుల్లో ఎస్ఐ ఉమేష్ చంద్ర అక్కడికక్కడే మరణించారు. మెస్ ఇంచార్జీ స్టీఫెన్ తీవ్రంగా గాయపడ్డారు.