వైద్య సేవల్లో ఎటువంటి లోపం రానీయవద్దు
కంపెనీ ఒప్పంద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు డైరెక్టర్ (పా, ఫైనాన్స్, పి అండ్ పి) ఎన్.బలరామ్ సూచన
సింగరేణి ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు అందించే వైద్య సేవల్లో ఎటువంటి జాప్యం, లోపం రాకుండా చూడాలని ఆ వైద్య ఖర్చులను వెంటనే చెల్లించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని డైరెక్టర్ (పా, ఫైనాన్స్, పి అండ్ పి) బలరామ్ చెప్పారు. సింగరేణి తో వైద్య సేవల ఒప్పందం ఉన్న ఆసుపత్రుల యాజమాన్యాల ప్రతినిధులతో మంగళవారం జరిగిన సమావేశంలో వైద్య సేవలపై సమీక్షించారు.
హైదరాబాద్, కరీంనగర్, విజయవాడ తదితర నగరాల నుంచి ఆసుపత్రుల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొని వైద్య సేవలకు బిల్లుల చెల్లింపులో ఉన్న సమస్యలను వివరించారు. సమస్యలను తెలుసుకున్న డైరెక్టర్ (పా) ఎన్.బలరామ్, ఇకపై బిల్లుల చెల్లింపు ప్రక్రియను మరింత సులభతరం చేస్తున్నామన్నారు. ఎటువంటి జాప్యానికి ఆస్కారం ఉండదన్నారు. పెండింగ్ లో ఉన్న బిల్లులను కాలపరిమితికి లోబడి చెల్లిస్తామన్నారు. ఆసుపత్రుల యాజమాన్యాలు కంపెనీతో కుదుర్చుకున్న మేరకు నిర్దేశిత నమూనాలో బిల్లులు చెల్లించాలన్నారు. ఎక్కువ బిల్లులను క్లెయిమ్ చేసి ఇబ్బందులకు గురికావొద్దని హితవు పలికారు. బిల్లుల చెల్లింపు విషయంలో ఎటువంటి జాప్యం జరిగినా నేరుగా తనను సంప్రదించవచ్చని హామీ ఇచ్చారు. కార్మికులకు, రిటైర్ అయిన కార్మికులకు వైద్య సేవలు అందించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆయన కోరారు.
ఈ సందర్భంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ప్రతినిధులు మాట్లాడుతూ ఇకపై సింగరేణి ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వైద్య సేవలు అందిస్తామన్నారు. కంపెనీ సూచించిన ఫార్మట్ లలో బిల్లులను సమర్పిస్తామని హామీ ఇచ్చారు. జనరల్ మేనేజర్ (కోఆర్డినేషన్) సూర్యనారాయణ మాట్లాడుతూ ఆసుపత్రుల యాజమాన్యాలకు రిఫరల్ కేసులు, బిల్లుల చెల్లింపు లో ఎటువంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకు రావాలని కోరారు. కార్యక్రమంలో పాల్గొన్న చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మంథా శ్రీనివాస్, డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బాల కోటయ్య, డీజీఎం (ఫైనాన్స్) శ్రీధర్ ఆసుపత్రుల వారీగా సమీక్ష నిర్వహించారు.