ఎస్ఐ నుంచి ఎస్పీ దాకా
ఆదిలాబాద్ ఎస్పీ ఉదయ్‌కుమార్ రెడ్డి ప్రస్థానమిది
పోలీసా… అడవుల పొంటి తిరగాలే… ఎప్పుడు ఎన్కౌంటర్లు… అన్నల చేతిలో ఎన్నడు సచ్చిపోతరో తెల్వదు.. తప్పని సరి పరిస్థితుల్లో బందూకూ భుజాన వేసుకుని ఉద్యోగానికి వచ్చిండు. ఎన్నో ఒడిదుడుకులు.. ఎత్తుపల్లాలు అధిరోహించి ఎస్సై స్థాయి నుంచి ఎస్పీ స్థాయి వరకు చేరుకున్నాడు.. ఆయనే ప్రస్తుతం ఆదిలాబాద్ ఎస్పీ గా విధులు నిర్వహిస్తున్న ఉదయ్‌కుమార్ రెడ్డి …. ఆయన ప్రస్థానంపై నాంది న్యూస్ ప్రత్యేక కథనం..
పోలీసు ఉద్యోగం అంటే అమ్మా..నాన్న భయపడ్డారు..
ఉదయ్ కుమార్ రెడ్డి పుట్టింది అడవుల జిల్లా ఖమ్మం లోని నేలకొండపల్లి మండలం మారుమూల గ్రామం రామచంద్రాపురం. అప్పట్లో పోలీస్ ఉద్యోగం అంటే ఆ ఊర్లో పెద్ద కొలువు. అది సాధించేందుకు చాలానే కష్టపడాల్సి వచ్చింది. కొలువు వచ్చాక పోస్టింగ్ ఏరియా చూసి సంబురం కంటే ఆయన కుటుంబంలో ఆందోళన కనిపించింది. ప్రొహిబిషన్ ఎస్సైగా ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఏజేన్సీలో తొలిసారి తుపాకీ పట్టారు. ఆయన పుట్టిన ప్రాంతం ఖమ్మంలో ఇటు ఉద్యోగం వచ్చిన ఆదిలాబాద్‌లో మావోల అలజడి ఉండేది. ఉదయ్‌కుమార్ రెడ్డి అమ్మనాన్నలకు అదే భయం.. నా కొడుక్కు ఏమవుద్దో ఏమో.. ఊరు కానీ ఊరు అన్నలుండే ఊరంట ఎలా కొలువు చేస్తాడో అని భయపడే వాళ్లు. కానీ తప్పని పరిస్థితుల్లో భుజానికి బందుకేసుకొని అడవుల్లో కూంబింగ్ కు వెళ్లారాయన. ఉట్నూర్ ఏజెన్సీ,పెంబి అడవులు , తిర్యాణీ గుట్టల్లో నెలల తరబడి కూబింగ్ చేసే వాళ్లు. అప్పట్లో మంగీ దళం , ఇంద్రవెళ్లి దళం ఆదిలాబాద్ అడవులను అడ్డాగా చేసుకుని కార్యకలపాలు సాగించేవి. భయపడకుండా ముందుకు సాగారు ఉదయ్..
ఉద్రిక్తతల మధ్య ఉద్యోగం…
ఆయన ఆదిలాబాద్ జిల్లా కడెంలో బాధ్యతలు చేపట్టే నాటికి ఇక్కడ చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఒక నెల ముందు పెంబి అడవుల్లో మావోలు మందుపాతరలు పేల్చి నలుగురిని హతమార్చారు. దాంతో ఈ ప్రాంతంలో ఎస్సై కొలువంటే కాసింత భయంగానే ఉండేది. అప్పటి ఎస్పీ ఆదేశాలతో మావోల ఏరివేతలో క్రియాశీలకంగా పనిచేసాం.. మావోల అడ్డాలో తనదైన శైలిలో విధులు నిర్వహిస్తూ శభాష్ అనిపించుకున్నారాయన. అనతి కాలంలోనే అనుకున్న లక్ష్యాన్ని ఛేదించడంతో సీఐగా పదోన్నతి లభించింది.. బెల్లంపల్లిలో తొలిసారిగా సీఐగా బాద్యతలు చేపట్టారు. బెల్లంపల్లిలోనూ అదే పరిస్థితి. ఆ సమయంలో ఆ ప్రాంతంలో మావోయిస్టు పార్టీ అనుబంధ సంఘం సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస) బలంగా కార్యకలాపాలు సాగించేది. అక్కడ కూడా మొక్కవోని ధైర్యంతో జనం అండదండలతో మావోలకు , సికాసకు చెక్ పెట్టగలిగారు ఉదయ్ కుమార్ రెడ్డి. 20 ఏళ్ల సర్విస్ లో 18 ఏళ్లు ఆదిలాబాద్ లోనే గడిచిందని.. ఈ జిల్లా నాకు కర్మభూమి అని తెలిపారు ఉదయ్ కుమార్ రెడ్డి.
పోలీసులమంటే లారీ డ్రైవర్లు సైతం దించేసేవారు..
ఆదిలాబాద్ లో ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయని అంటున్నారు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి. తాను ఎస్సైగా విదులు నిర్వహించిన సమయంలో కనీసం జిల్లా కేంద్రానికి సరైన రోడ్డు మార్గం లేదని.. ఆర్టీసి బస్సులు నడిచేవి కావని.. లారీల్లో ప్రయాణించే వాళ్లమని.. పోలీసులమని చెపితే లారీ డ్రైవర్లు సైతం దింపేసేవారని.. మిమ్మల్ని తీసుకెళితే అన్నలు మా ప్రాణాలు తీస్తారంటూ భయపడే వాళ్లని.. తప్పని పరిస్థితుల్లో బెదిరించో బుజ్జగించో ప్రయాణాలు సాగించే వాళ్లమని తెలిపారు ఉదయ్ కుమార్. 1992 లో జన్నారం నుండి కడెం వెళ్లేందుకు ఎలాంటి ప్రయాణ సౌకర్యం లేకపోవడంతో 32 కిలో మీటర్లు కాలినడకన నడిచి వెళ్లాల్సి వచ్చిందని.. ఆ సమయంలో స్టేషన్ చేరే వరకు ప్రాణాల మీద నమ్మకం లేదని తెలిపారు ఆయన.
లక్ష్యం గొప్పదైతే రాళ్ల బాట పూలదారి అవుతుంది…
పోలీసు శాఖలో ఉన్నతశిఖరాలను అధిరోహించే అవకాశం తక్కువ సమయంలో దక్కుతుందని అన్నారు ఉదయ్. ఎస్సై నుండి ఎస్పీగా పదోన్నతి పొందడం.. అది కూడా ఆదొలాబాద్ జిల్లాలోనే ఈ అవకాశం దక్కడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు ఆయన. ఆయనకు తాజాగా డిసెంబర్ 24 న నాన్ కాడర్ ఐపిఎస్ గా పదోన్నతి లభించింది. అంతలోనే మరో శుభవార్తగా ఆదిలాబాద్ ఎస్పీగా బదిలీ సమాచారం అందింది ఆయనకు రాళ్ల బాటలో నడిచినా లక్ష్యం గొప్పదైతే అదే దారి పూలదారిగా మారుతుందని.. అందుకు తనే సాక్ష్యం అంటారు ఉదయ్ కుమార్ రెడ్డి.