ఆ కార్మిక సంఘాలు దొందూ దొందే
మంచిర్యాల – సింగరేణిలో గుర్తింపు సంఘం అయిన టీబీజీకేఎస్, ప్రాతినిథ్య సంఘమైన ఏఐటీయూసీ రెండూ ఒకటేనని ఐఎన్టీయూసీ నేతలు దుయ్యబట్టారు. మదమర్రిలో ఐఎన్టీయూసీ కార్యకర్తల సన్నాహాక సమావేశానికి కేంద్ర సీనియర్ ఉపాధ్యక్షుడు సిద్ధంశెట్టి రాజమౌళి, కేంద్ర ప్రధాన కార్యదర్శి కంపెల్లి సమ్మయ్య, కేంద్ర కమిటీ చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ రాంశెట్టి నరేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రెండు సంఘాలు కలిసి కార్మికులను కష్టనష్టాలకు గురి చేస్తున్నాయని అన్నారు. కార్మికుల దగ్గర నుండి ఎంత దొరికితే అంత వసూలు చేస్తుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేజీల మీద తిట్టుకుంటూ ఆఫీసులలో మాత్రం కలిసి పైరవీలు చేసుకుంటున్నారని వారు విమర్శించారు. టీబీజీకేఎస్, ఏఐటీయూసీ చేసే అకృత్యాలను చూసి కార్మికులు ఐఎన్టీయూసీ వైపు వస్తుంటే, ఆ ఆదరణ చూసి ఓర్వలేని టీబీజీకేఎస్ నాయకులు వారిని బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ఒక్కఐఎన్టీయూసీ కార్యకర్త భయపడే ప్రసక్తే లేదని ఈ సందర్బంగా స్పష్టం చేశారు. 26న జరగబోయే ఐఎన్టీయూసీ సమావేశానికి ముఖ్య అతిథిగా సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ హాజరవుతారని అన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సింగరేణిని కాపాడుకోవడానికి జరగబోయే ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు. మందమర్రి ఏరియాలోని ప్రతి ఒక్క ఐఎన్టీయూసీ కార్యకర్త కార్మికులను చైతన్యం చేయాలన్నారు. జనక్ ప్రసాద్ లాంటి నాయకుడు మనకు ఉండటం గర్వకారణమన్నారు. కార్యక్రమంలో రామకృష్ణాపుర్ వైస్ ప్రెసిడెంట్ తేజావత్ రాంబాబు, మందమర్రి ఏరియా సెక్రెటరీస్ కే.ఓదెలు, చంద్రశేఖర్ దొరిశెట్టి, మండ భాస్కర్, కేకే5 పిట్ సెక్రెటరీ బీమారపు సదయ్య, కాసిపేట 1 పిట్ సెక్రెటరీ రవీందర్, కాసిపేట 2 పిట్ సెక్రెటరీ కొప్పుల బాపు, శాంతి ఖని పిట్ సెక్రెటరీ పి. శివ, RK1A అసిస్టెంట్ పిట్ సెక్రటరీ చిరంజీవి, ఏరియా నాయకులు కారుకురి తిరుపతి, కొమురయ్య ఇక్రముద్దిన్, భగవాన్ సింగ్, స్వామి, పిట్ నాయకులు దేవ రమేష్, హరీష్,రాజేష్, వెంకట స్వామి, రాము, కార్యకర్తలు పాల్గొన్నారు