దళారులను నమ్మి మోసపోకండి
అనవసరపు ఆందోళనలు వద్దు - జిల్లా సంక్షేమాధికారి మాస ఉమాదేవి
మంచిర్యాల : ఐసీడీఎస్ సూపర్వైజర్లకు పోస్టుల విషయంలో దళారులను నమ్మి మోసపోవద్దని మంచిర్యాల జిల్లా సంక్షేమాధికారి మాస ఉమాదేవి స్పష్టం చేశారు. అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉద్యోగాల కేటాయింపునకు సంబంధించి త్వరలో పూర్తి స్థాయి విధివిధానాలు తెలుస్తాయన్నారు. అప్పటి వరకు ఎవరూ ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు. పరీక్షలు జేఎన్‌టీయూసీ నిర్వహించిందన్నారు. 17,000 మంది పరీక్షలు రాయగా, వీరిలో 433 మంది మాత్రమే ఉద్యోగాలకు అర్హత సాధిస్తారని వెల్లడించారు. ఇందులో పాస్, ఫెయిల్‌కు సంబంధించిన మార్కులు ఏవీ లేవన్నారు. కేవలం మెరిట్ ప్రకారమే ఉద్యోగాలు వస్తాయన్నారు. ఎవరైనా ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మిస్తే అలాంటి వాటిని నమ్మి మోసపోవద్దని మరోమారు స్పష్టం చేశారు. కాంట్రాక్టు సూపర్వైజర్లకు వెయిటేజీ ఏం కలపడం లేదని, ఫలితాల తర్వాత పూర్తి స్థాయిలో అధికారులు దానిపై నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. ఎలాంటి అనుమానాలు ఉన్నా సీడీపీవోలను కానీ, నన్ను కానీ నిరంభ్యంతరంగా కలువొచ్చని ఆమె స్పష్టం చేశారు.