జ్వరం ఉందా…? వ్యాక్సిన్ వేసుకున్నారా..?
ఏమ్మా. ఇంట్లో ఎవరికైనా జ్వరం ఉందా..? వ్యాక్సిన్ వేసుకున్నారా…? ఇలా ఇంటింటికి వెళ్లి అడిగి తెలుసుకున్నారు ఆమె.. ఇలా అడిగింది. ఆరోగ్య సిబ్బందో, వేరెవరో కాదు.. సాక్షాత్తు మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళీకేరీ. జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఫీవర్ సర్వేను ఆమె పరిశీలించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎన్.టి.ఆర్ నగర్ లో చేపట్టిన ఆరోగ్య సర్వేలో వైద్య అధికారులు, సిబ్బందితో కలిసి ఇంటింటా తిరుగుతూ ప్రజలకు కరోనా వైరస్ నియంత్రణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హోళీకేరీ మాట్లాడుతూ ఆరోగ్య సర్వే కోసం జిల్లాలో 485 బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ బృందాలు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పర్యటిస్తూ ఇంటింటా సర్వే నిర్వహిస్తాయన్నారు. ఇంట్లో ఎవరికైనా జ్వరం, జలుబు ఇతర లక్షణాలు ఉన్నట్లయితే అవసరమైన మందులు అందించడంతో పాటు తగు సూచనలు చేస్తారని స్పష్టం చేశారు. ఐదు రోజుల పాటు లక్షణాలు అలాగే ఉంటే అనవసరమైన పరీక్షలు నిర్వహించి వైద్యుల సూచన మేరకు హోమ్ ఐసోలేషన్ కిట్లు అందిస్తారని చెప్పారు. వైరస్ నియంత్రణలో ప్రజలు సామాజిక దూరం పాటించాలని, మాస్కు ధరించాలన్నారు. ప్రజా ఆరోగ్యం దృష్ట్యా ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య సర్వేను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఆరోగ్య సర్వే బృందం సభ్యులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.