స్టేట్ ఫస్ట్ ర్యాంక్ మనమ్మాయే..
ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా… తన మాతృసంస్థలోనే చేయాలనే సంకల్పం. ఆ ఉద్యోగానికి రాజీనామా చేసింది. అనుకున్న లక్ష్యం నెరవేర్చుకుంది. రాష్ట్రంలోనే అత్యధిక మార్కులతో ఉద్యోగం సంపాదించుకున్న వేముల శ్రీలతపై ప్రత్యేక కథనం…
ముల శ్రీలత మంచిర్యాల జిల్లా మందమర్రిలో అంగన్‌వాడీగా పద్దెనిమిది సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే తపనతో పరీక్ష రాసి పంచాయతీ సెక్రటరీగా ఎంపికైంది. కాసిపేట మండలం చిన్న ధర్మారంలో పోస్టింగ్ ఇచ్చారు. అయితే అది అంతగా సంతృప్తి ఇవ్వలేదు. దీంతో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఎట్టి పరిస్థితుల్లో తన మాతృసంస్థలోనే ఉన్నత ఉద్యోగం సంపాదించాలనే తపన వీడలేదు. దీంతో శ్రీలత కొద్ది రోజులు వేచి చూసింది.
అనుకున్న లక్ష్యం నెరవేరే రోజొచ్చింది. మహిళా శిశు సంక్షేమ శాఖలో గ్రేడ్ 2 సూపర్‌వైజర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు మూడు నెలల కిందట దరఖాస్తులు చేసుకునేందుకు అంగన్‌వాడీ టీచర్లకు అనుమతి వచ్చింది. దీంతో ఆ పోస్టుకు దరఖాస్తు చేసుకుంది. ఆ పోస్టుకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా శ్రీలత మొదటి ర్యాంకు సాధించింది. 28.250 మార్కులతో రాష్ట్రంలోనే మొదటి ర్యాంకు సాధించడం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీలత నాంది న్యూస్‌తో మాట్లాడుతూ తను ఖచ్చితంగా ఉద్యోగం సాధించాలనే తపనతోనే రాశానని రాష్ట్రంలో మొదటి ర్యాంకు ఊహించలేదని వెల్లడించింది.