ఆస్తుల్లో టీఆర్ఎస్ రెండో స్థానం
పార్టీలకు సంబంధించిన అత్యధిక ఆస్తులు ఉన్న వాటిల్లో తెలంగాణ రాష్ట్ర సమితి దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. 2019-20 సంవత్సరానికి సంబంధించి దేశంలోని ఏడు జాతీయ పార్టీలు, 44 ప్రాంతీయ పార్టీల ఆస్తులు, అప్పుల వివరాలను అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం జాతీయ పార్టీల్లో బీజేపీకి అత్యధికంగా రూ.4,847.78 కోట్ల మేర ఆస్తులు ఉన్నాయని వెల్లడైంది. బీజేపీ తర్వాతి స్థానంలో బహుజన సమాజ్ పార్టీ ఉంది. ఆ పార్టీకి రూ. 698.33 కోట్లు ఉన్నట్లు నివేదికలో వెల్లడైంది. జాతీయ పార్టీల మొత్తం ఆస్తుల విలువలో బీజేపీకి 69.37 శాతం ఆస్తులున్నట్లు నివేదిక పేర్కొంది.
ఇక ప్రాంతీయ పార్టీల విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీకి అత్యధికంగా రూ. 563.47 కోట్ల ఆస్తులున్నాయి. ఈ జాబితాలో రెండో స్థానంలో టీఆర్ఎస్ ఉంది. టీఆర్ఎస్ పార్టీకి రూ.301.47 కోట్ల ఆస్తులున్నాయి. తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే రూ.267.61 కోట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఫిక్సుడ్ డిపాజిట్లు, రుణాలు, ముందస్తు చెల్లింపులు, పెట్టుబడులు, ఇతరత్రా వివరాల ప్రాతిపదికన ఈ ఆస్తుల విలువ లెక్కకట్టారు.
అప్పుల విషయానికి వస్తే.. జాతీయ పార్టీలలో కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా అప్పులున్నాయి. ఆ పార్టీకి రూ.49.55 కోట్ల అప్పులున్నాయని నివేదిక ప్రకటించిది. ఆ తర్వాతి స్థానంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆ పార్టీకి రూ.11.32 కోట్ల అప్పు ఉంది. ప్రాంతీయ పార్టీలలో తెలుగు దేశం పార్టీకి అత్యధికంగా అప్పులు ఉన్నాయని ఏడీఆర్ రిపోర్టు తెలిపింది. టీడీపీకి రూ.30.34 కోట్ల అప్పులు ఉన్నాయని పేర్కొంది. ఈ జాబితాలో డీఎంకే పార్టీ రూ.8.05 కోట్ల అప్పుతో రెండో స్థానంలో ఉందని వెల్లడించింది.