మేమున్నామని.. మీకేం కాదని..
-ఎమ్మెల్యే శ్రీధర్ బాబుకి సెక్యూరిటీ ఇవ్వని పోలీసులు -అండగా నిలిచిన గ్రామస్థులు
ఒక ఎమ్మెల్యే సెక్యూరిటీ ఇవ్వాల్సిన పోలీసులు అన్నల భయంతో వెనక్కి తగ్గారు. కానీ గ్రామస్థులు మాత్రం మేం అండగా ఉన్నామని వెంట నిలబడ్డారు. వివరాల్లోకి వెళితే.. మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు నియోజకవర్గంలో విస్తుతంగా పర్యటించారు. శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం వెళ్లిన మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు కు తాము సెక్యురిటి ఇవ్వలేమని పోలీసులు తేల్చి చెప్పారు. మహారాష్ట్ర చత్తీస్ఘడ్ రాష్ట్రాల సరిహద్దులో ఉన్న గ్రామాల్లోకి ఎమ్మెల్యేతో వెళ్ళమని, మావోయిస్టుల కదలికలు ఎక్కువగా ఉండే ఆ ప్రాంతానికి రాలేమని స్పష్టం చేశారు. దీంతో మేమున్నామంటూ పలిమెల గ్రామస్తులు ముందుకు వచ్చారు. మా ఎమ్మెల్యేను మేం కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేసి బాసటగా నిలిచారు. దీంతో ఎమ్మెల్యే శ్రీధర్ బాబు తన పర్యటన విజయవంతం గా ముగించుకున్నారు. గతంలో శ్రీధర్ బాబు తండ్రిని ఈ ప్రాంతంలోనే నక్సలైట్లు హత్య చేశారు.