సీఎంపీఎఫ్ నిధుల రికవరీకి ఆదేశాలు
తమ పోరాటాల ఫలితమే అన్న బీఎంఎస్
మంచిర్యాల : తమ సొమ్ము పక్క దారి పడుతుందని ఆందోళన వ్యక్తం చేసిన కార్మికులకు ఊరట లభించింది. సీఎంపీఎఫ్ డబ్బుల విషయంలో గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా నిధులు పక్కదారి పట్టాయి. ఇప్పుడు వాటి రికవరీకి ఆదేశాలు జారీ కావడంతో కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ పోరాటాల ఫలితంగానే ఈ ఆదేశాలు జారీ అయినట్లు భారతీయ మజ్దూర్ సంఘ్ నేతలు చెబుతున్నారు.
నిధులు పక్కదారి ఇలా..
2013-14 ఆర్థిక సంవత్సరంలో దివాన హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (DHFL)కు సీఎంపీఎఫ్ ట్రస్టు నుంచి 1,300 కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ పెట్టుబడి పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. తమ కంపెనీ దివాళా తీసిందని దివాన హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీ సీఎంపీఎఫ్ ట్రస్టు బోర్డుకు ప్రతిపాదన పంపింది. దీంతో వెంటనే ఆ కంపెనీ బాకీ ఉన్న 727 కోట్ల 56 లక్షల రూపాయలను CMPF ట్రస్టు రద్దు చేసింది.
రికవరీకి నిర్ణయం..
దీనికి సంబంధించిన విషయంలో భారతీయ మజ్దూర్ సంఘ్ కొద్ది రోజులుగా పోరాటం సాగిస్తోంది. తాజాగా 24న సింగరేణితో పాటు దేశవ్యాప్తంగా CMPF కార్యాలయాల వద్ద బీఎంఎస్ ఆధ్వర్యంలో భారీ నిరసనలు, ఆందోళనలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో సింగరేణి సంస్థకు చెందిన సీఎంపీఎఫ్ నిధులను తిరిగి దివాన హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ సంస్థ నుండి రికవరీ చేయాలని సీఎంపీఎఫ్ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. రూ.727 కోట్ల కంటే ఎక్కువ నిధులను రద్దు(రైటాఫ్) చేయాలన్న నిర్ణయాన్ని సిఎంపీఎఫ్ ట్రస్టీ” యాజమాన్యం ఉపసంహరించుకోవాలని సీఎంపీఎఫ్వో నిర్ణయించింది. అంతేకాకుండా వెంటనే రికవరీ ప్రక్రియను ప్రారంభించాలని కూడా నిర్ణయించారు. ఈ మేరకు సీఎంపీఎఫ్ కమిషనర్ సమీరస్ దత్తా శుక్రవారం ధన్బాద్లో ఒక ప్రకటన కూడా విడుదల చేశారు.
మా ఆందోళన ఫలితమే..
మ ఆందోళన ఫలితమే ఈ సీఎంపీఎఫ్ నిధుల రికవరీ నిర్ణయమని బీఎంఎస్ నేతలు చెబుతున్నారు. కేంద్ర ABKMS నాయకులు, జాతీయ బొగ్గుగనుల ఇంచార్జి కొత్తకాపు లక్ష్మారెడ్డి అధికారులతో మాట్లాడి రికవరీ కోసం తీవ్రంగా కృషి చేశారని చెబుతున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నట్లు బీఎంఎస్ నేతలు స్పష్టం చేశారు.