రాజకీయ లబ్ధికే సమ్మె
-సింగరేణిలో అవినీతిపై పోరాటం చేయండి
-నెరవేర్చని ముఖ్యమంత్రి హామీలపై సమ్మె చేయండి
-కాంగ్రెస్, సీపీఐ అనుబంధ సంఘాల నేతలకు రఘునాథ్ పిలుపు
మంచిర్యాల : కేవలం రాజకీయ లబ్ధి కోసమే సింగరేణి కార్మిక సంఘాలు సమ్మె చేస్తున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ అన్నారు. సింగరేణి సంస్థ ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుందని టిఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని దాన్ని ఖండిస్తున్నామన్నారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సమ్మె చేస్తున్న టీబీజీకేఎస్, కమ్యూనిస్టు, కాంగ్రెస్ అనుబంధ సంస్థలు సింగరేణి లో జరుగుతున్న అవినీతి మీద సమ్మె చేయాలని డిమాండ్ చేశారు. 2018 ఫిబ్రవరిలో 27 న శ్రీరాంపూర్ లో జరిగిన సభ లో ముఖ్యమంత్రి కేసిఆర్ ఎన్నో హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. సింగరేణి కార్మికులకు 400 కోట్ల తో నూతన క్వార్టర్ల నిర్మిస్తామని, క్వార్టర్ల ఉచిత మంచి నీరు, ఉచిత కరెంట్ ఇలా ఎన్నో చెప్పారని అన్నారు. అలియాస్ పేర్లు మార్పుకు అవకాశం, రిటైర్డ్ కార్మికులకు పెన్షన్ పెంపు వంటి అనేక హామీలు ఇచ్చి నాలుగు సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు వాటిని నెరవేర్చలేదన్నారు. వీటి పై టిఆర్ఎస్, కమ్యూనిస్టు మరియు కాంగ్రెస్ పార్టీలు సమ్మె చేయాలని డిమాండ్ చేశారు.
రానున్న సింగరేణి కార్మిక ఎన్నికల్లో లబ్ధి కోసమే టిఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం పై తప్పుడు ప్రచారం చేసి కార్మికులను తప్పు దోవ పట్టిస్తోందని రఘునాథ్ దుయ్యబట్టారు. బొగ్గు బ్లాకుల వేలం విషయంలో సింగరేణి సంస్థ ఒడ్డిస్సా రాష్ట్రంలో వేలంలో పాల్గొని రెండు బ్లాకులని దక్కించుకుందన్నారు. మరి తెలంగాణలో బొగ్గు బ్లాకుల వేలం లో ఎందుకు పాల్గొనడం లేదని ప్రశ్నించారు. సింగరేణి సంస్థ రాష్ట్రంలో నాలుగు బ్లాకుల వేలంలో బిడ్ దాఖలు చేస్తే కేంద్ర ప్రభుత్వం ఆ బ్లాకులను సింగరేణికి కేటాయించడానికి సిద్దంగా ఉందని సింగరేణి సంస్థ బిడ్లు ఎందుకు దాఖలు చేయడం లేదన్నారు. సింగరేణి సంస్థలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు నియమించి, తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ ను ప్రైవేట్ సంస్థకు అప్పజెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వమే సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తోందన్నారు. ఇప్పటికైనా టీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్ పార్టీలు బీజేపీపై తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలన్నారు. లేదంటే రాబోయే రోజుల్లో కార్మికుల తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
కార్యక్రమంలో అందుగుల శ్రీనివాస్, కౌన్సిలర్ అగల్ డ్యూటీ రాజు, పెద్దపల్లి పురుషోత్తం, పట్టి వెంకట కృష్ణ, బియ్యాల సతీష్ రావు, బుద్దారపు రాజమౌళి, రంగు వేణు, అక్కల రమేష్, కర్రే చక్రి, దేవి సాయి పాల్గొన్నారు.