ఎండలు మండిపోతున్నయ్…
-రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు
-బయటకు రావాలంటేనే జంకుతున్న జనం
-కోల్‌బెల్ట్‌లో మరింతగా వేడిమి
మంచిర్యాల : ఎండలు మండిపోతున్నాయి. ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జనం బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. తుఫాను ప్రభావంతో కాస్తాకూస్తో చల్లబడిన వాతావరణం మళ్లీ వేడెక్కింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంటోంది. జనం బయటకు రావాలంటేనే హడలిపోతున్నారు. మధ్యాహ్నా సమయాల్లో రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి.శనివారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదయింది. ఆదిలాబాద్ జిల్లా జైనథ్లో 45.5 డిగ్రీలు, నిర్మల్ జిల్లా కుంటాల లో 45.5 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా చప్రాలలో 45.3, బోరజ్లో 45.2 గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అధిక ఉష్ణోగ్రతలకు తోడు వేడిగాలులు కూడా నమోదు కావడంతో జనం హడలిపోతున్నారు. ఈ ఏడాది వేసవి ప్రారంభం నుంచే ఉష్ణోగ్రతలు కాస్త అధికంగానే నమోదవుతూ వస్తున్నాయి.
ఉక్కపోత అధికంగా ఉండటంతో జనం అల్లాడుతున్నారు. దీనికితోడు అధికంగానున్న విద్యుత్ కోతలు మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కరెంటు ఉంటే కూలర్లు, ఎసిలు ఆన్ చేసుకుని సేదదీరేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎండ వేడిమి పెరగడంతో శీతలపానియాలు, జ్యూస్ కేంద్రాలకు విపరీతమైన గిరాకీ పెరిగింది. అదే సమయంలో మినరల్ వాటర్ ప్లాంట్లలోనూ ప్రత్యేకంగా కూలింగ్ వాటర్ క్యాన్లను అమ్ముతున్నారు. వీటి ధర గతంలో రూ.20 ఉండగా, ఇప్పుడు రూ.40 వరకు ఉంటోంది. వీటిని మంచి గిరాకీ పెరిగింది.
శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు
ప్రాంతం-జిల్లా ఉష్ణోగ్రతలు
కుంటాల (ని్ర్మల్) 45.5
జైనథ్ (ఆదిలాబాద్) 45.5
కొత్తపల్లిగోరే (జయశంకర్) 45.3
ఈసాల తక్కళ్లపల్లి (పెద్దపల్లి) 45.1
పల్డా (నిజామాబాద్) 45.0
శాయంపేట (హన్మకొండ) 45.0
ఎండపల్లి (జగిత్యాల) 44.9
జమ్మకుంట (కరీంనగర్) 44.8
భిక్నూరు (కామారెడ్డి) 44.7
మేడారం (ములుగు) 44.7
రఘునాథపల్లి(జనగాం) 44.5