ప్రజలకు అందుబాటులో ఉంటాం..
-మీ భద్రత మా బాధ్యత
-ఇంచార్జ్ డీసీపీ అఖిల్ మహాజన్
మంచిర్యాల : పోలీసులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, మీ భద్రత మా బాధ్యత అని మంచిర్యాల్ జోన్ ఇంచార్జ్ డీసీపీ అఖిల్ మహాజన్ స్పష్టం చేశారు. దేవాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ని పాత తిరుమలపూర్లో పోలీసులు మీకోసం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రెసిడెన్సీయల్ పాఠశాలలు,హాస్టళ్లు ఏర్పాటు చేసిందన్నారు. వాటిని సద్వినియోగం చేసుకొని పిల్లల్ని తప్పనిసరిగా చదివించాలన్నారు. ఈ ప్రాంతం నుండి తక్కువ మంది చదుకుంటున్నారని, తల్లితండ్రులు తప్పకుండా పిల్లలను పాఠశాలలకి పంపించాలననారు. వారి బంగారు భవిష్యత్తుకు పునాది వేయాలని కోరారు. ఏదైనా సమస్య ఉంటే ఎస్ఐ, పోలీస్ అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. గ్రామం లో ఎవరికైనా ఆరోగ్య, కంటి సంబంధిత సమస్యలు ఉంటే లయన్స్ క్లబ్ సాయంతో కంటి పరీక్షలు చేయిస్తామన్నారు.
ఎవరైనా అనుమానస్పద వ్యక్తులు కనిపిస్తే, ఎలాంటి సమాచారం ఉన్న సంబంధిత అధికారులకు చెప్పాలన్నారు . సంఘవిద్రోహక శక్తులకు సహకరించవద్దని డీసీపీ కోరారు. యువత తమ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం విడుదల చేసిన పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మందమర్రి, బెల్లంపల్లి, మంచిర్యాలలో ఉచిత కోచింగ్ క్యాంపు లు నిర్వహిస్తున్నామని అన్నారు. స్థానిక ఎస్ఐకి వివరాలు చెబితే ఉచిత కోచింగ్ కోసం పోలీసులు సహకారం అందిస్తారని తెలిపారు. ఒకప్పుడు మావోయిస్టుల ప్రభావం వలన పోలీసు ఉద్యోగం చెయ్యడానికి ముందుకు వచ్చే వారు కాదన్నారు. ఇప్పుడు ఏజెన్సీ , మావోయిస్టు ప్రభావిత మారుమూల గ్రామాల నుంచి యువత పోలీసు ఉద్యోగం కోసం పట్టుదలతో ముందుకు రావడం ప్రశంసనీయమన్నారు.
ఈ సందర్భంగా డీసీపీ అఖిల్ మహాజన్ చేతుల మీదుగా 40 మంది నిరుపేద కుటుంబాలకు దుప్పట్లు, ఒక్కొక్కరికి 20 కిలోల బియ్యంతో పాటు యువకులకు వాలీబాల్ కిట్లు, చిన్న పిల్లలకు స్కూల్ బుక్స్, నోట్స్ బుక్స్, పెన్నులను అందచేశారు. కార్యక్రమంలో మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రమోద్ రావు, దేవపూర్ ఎస్ఐ విజేందర్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.