బారెపల్లి ఘటనలో కేసులు నమోదు
మంచిర్యాల : మంచిర్యాల జిల్లా తాండూరు మండలం బారెపల్లి ఘటనలో పోలీసులు నలుగురిపై కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఎంపీపీ ప్రణయ్ కలిసి బారెపల్లిలో మన ఊరు, మన బడి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు.దీంతో పలువురు ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. తమ గ్రామంలో సమస్యలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బారెపల్లి గ్రామంలో రోడ్లు, నీరు తదితర కనీస వసతులు కల్పించడం లేదని ఎమ్మెల్యే వాహనం ముందుకెళ్లకుండా రోడ్డు పై కూర్చుని నినాదాలు చేశారు. ఈ ఘటనలో జడ్పీటీసీ బానయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనతో సంబంధం ఉన్న తాళ్లపల్లిభాస్కర్ గౌడ్, ఆడె శ్రీనివాస్ రావు, బామండ్లపల్లి నందు, ఆడె సాయికిరణ్ నలుగురిపై కేసు నమోదు చేశారు.
ప్రజలపై కేసులు పెడతారా…?
తమకు రోడ్డు, నీరు కావాలని అడిగిన ప్రజలపై కేసులు పెడతారా..? అని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి బొమ్మెన హరీష్ గౌడ్ ప్రశ్నించారు. రాజ్యాంగ బద్దంగా నిరసన తెలియచేస్తున్న ప్రజలపై తప్పుడు కేసులు పెట్టడం ఏ మేరకు సమంజమని ఆయన ప్రశ్నించారు. పోలీసులు తప్పుడు కేసులతో ప్రజల్ని నిర్బంధాలకు గురి చేస్తున్నారని దుయ్యబట్టారు. సీఐ జగదీష్ అమాయకులపై కేసులు పెట్టి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తున్నారని అన్నారు. ఈ వ్యవహారంలో కేంద్ర మంత్రులు, గవర్నర్ని కలిసి న్యాయ పోరాటం చేస్తామని అన్నారు.