అప్పుల బాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అప్పుల బాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.వ్యవసాయం కోసం తెచ్చిన అప్పుల భారం పెరిగి ఒక్కరు ఉరేసుకొని బలవన్మరణం కు పాల్పడితే మరొకరు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
కొమురం భీమ్ జిల్లా కెరమెరి మండలం తుమ్మగూడకు చెందిన రాథోడ్ మోహన్ (45) కు నాలుగెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమిలో పత్తి పంట సాగుకు రూ.3 లక్షల వరకు అప్పులు చేశారు. దిగుబడులు రాకపోవడంతో పాత రుణం తీరలేదు. పైగా ఈ ఏడాది పంట సాగుకు ఎక్కడా అప్పు పుట్టలేదు. దీంతో మానసికంగా కుంగిపోయిన మోహన్ బుధవారం రాత్రి పురుగుమందు తాగారు. ఆసిఫాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు.
ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం ఖడ్కి గ్రామానికి చెందిన మడావి మారు(50)కు ఎనిమిదెకరాల భూమి ఉంది. పత్తి,కంది సాగుకు రూ.3.50 లక్షల వరకు అప్పులు అయ్యాయి. దిగుబడి రాక మరింత నష్టపోయారు. పైగా ప్రస్తుత ఖరీఫ్ సాగుకు అవసరమయ్యే సాగు కోసం ఎవరూ అప్పు ఇవ్వలేదు. మనస్తాపం చెందిన ఆయన.. బుధవారం రాత్రి గ్రామ శివారులోని చెట్టుకు ఉరేసుకుని బలవణ్మరానికి పాల్పడారు. ఇద్దరు రైతుల ఆత్మ హత్య ఆ రెండు కుటుంబాల లో విషాదాన్ని నింపింది.