మిగతా వారికి పట్టాలు అందించాల్సిందే..
-మిగిలి ఉన్న క్వార్టర్లు పేదలకు ఇవ్వాలి
-సింగరేణి,మున్సిపల్ అధికారులతో విప్ బాల్క సుమన్
మంచిర్యాల : సింగరేణిలో ఏరియాలో పట్టాలు పంపిణీ చేయకుండా మిగిలి ఉన్న వారికి సైతం వాటిని అందించాల్సిందేనని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ స్పష్టం చేశారు. క్యాతనపల్లి లో ఆయన సింగరేణి, మున్సిపల్ అధికారులతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సింగరేణి ఏరియాలలోని భూముల క్రమబద్ధీకరణ కోసం తీసుకొచ్చిన జీవో 76 గడువును ప్రభుత్వం రెండు నెలలు పొడిగించిందని తెలిపారు. ఆగస్టు 12 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు స్పష్టం చేశారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
RK 4గడ్డ, శాంతినగర్, వల్లభాయి నగర్ నాగార్జున కాలనీ, ప్రగతి కాలనీ, రాజీవ్ నగర్, ఠాగూర్ నగర్, రామ్ నగర్, భగత్ సింగ్ నగర్, గంగా కాలనీ, సూపర్ బజార్ ఏరియా,దుర్గా రావు మార్కెట్, గీతా మందిర్ ఏరియా లో మిస్సయిన ఇండ్ల తో పాటు సింగరేణి క్వార్టర్ల మధ్య నివాసం ఉంటున్న వారిని కూడా పరిగణలోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మందమర్రి, రామకృష్ణాపూర్ పట్టణాల్లో ఖాళీగా ఉన్న 1600 పైగా సింగరేణి క్వార్టర్లను రిటైర్డ్ సింగరేణి కార్మికులకు కేటాయించగా మిగిలిన వాటిని నిరుపేదలకు అందించేలా రెవిన్యూ విభాగానికి అందించాలని కోరారు.
మందమర్రి, రామకృష్ణాపూర్ పట్టణాల్లో సింగరేణి ఏరియాలలో శానిటేషన్, తాగునీరు రోడ్లు, లైట్లు, పిచ్చి మొక్కల తొలగింపు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. శానిటేషన్ కి సంబంధించి సింగరేణి అధికారులు మున్సిపల్ అధికారులు సమన్వయంతో పని చేసుకోవాలని కోరారు. సమావేశంలో సింగరేణి GM చింతల క్యాతనపల్లి చైర్‌పర్సన్ జంగం కళ, మున్సిపల్ చైర్మన్లు, నాయకులు పాల్గొన్నారు.