సింగరేణి కార్మికుల ఆందోళన
-మద్దతు తెలిపిన కార్మిక సంఘ నేతలు
-పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు
-మృతదేహాలతో పాటే వచ్చిన ఎమ్మెల్యేలు
మంచిర్యాల : మంచిర్యాల ప్రధాన ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆసిఫాబాద్ జిల్లా పెసరకుంట పెద్దవాగులో సింగరేణి రెస్క్యూ టీమ్ సభ్యులిద్దరు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో సీహెచ్.సతీష్, రాము ఇద్దరు గల్లంతయ్యారు. వారి మృతదేహాలు గురువారం ఉదయం లభించాయి. రెస్క్యూ ఆపరేషన్‌లో మృతి చెందిన ఇద్దరు కార్మికులకు పోస్టుమార్టం నిర్వహించేందుకు ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో కార్మికులు ఆసుపత్రి ఎదుట రహదారిపై ఆందోళన నిర్వహించారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.మృతి చెందిన వారి ఒక్కో కుటుంబానికి రెండు కోట్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పెద్దఎత్తున కార్మికులు అక్కడకు చేరుకోవడం, ఆందోళన నేపథ్యంలో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. కార్మికుల ఆందోళనకు ఏఐటీయూసీ నేత వాసిరెడ్డి సీతారామయ్య, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షుడు సురేందర్‌రెడ్డి మద్దతు తెలిపారు. యాజమాన్యం పరంగా రావాల్సిన నష్టపరిహారం అందేలా చూస్తామని జీఎం హామీ ఇచ్చారు.ఆ ఇద్దరు మృతదేహాలతో పాటే సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వచ్చారు. వారిద్దరు మృతుల కుటుంబాలను ఓదార్చారు.