రెండు మెస్ లపై కేసులు నమోదు
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనలో అధికారులు చర్యలు ప్రారంభించారు. రెండు మెస్ లపై కేసులు నమోదు చేశారు. శుక్రవారం మధ్యాహ్న భోజనం చేసిన విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దాదాపు 300 మందికి వాంతులు, విరోచనాలు అయ్యాయి. దీంతో వారిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స తర్వాత పలువురు విద్యార్థులను డిశ్చార్జ్ చేశారు. నిజామాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఐసీయూలో 9 మంది విద్యార్థులు చికిత్స పొందుతున్నారు.
ఈ ఘటన పై ప్రభుత్వం సీరియస్ అయింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఘటనకు బాద్యులు అయిన వారిపై చర్యలు తీసుకోవాలని అదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లా కలెక్టర్ ముషరఫ్ ఆలీ చర్యలకు ఉపక్రమించారు. ఎఫ్ ఐ ఆర్ బుక్ చేయాలని ఎస్పి కి కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. రెండు మెస్ లపై కేసులు నమోదు చేశారు. 273, 357,59FSSA సెక్షన్ల కింద ఈ కేసులు పెట్టారు.