ఆయకట్టు రైతులను ఆదుకోండి
డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ
మంచిర్యాల : భారీ వర్షాల కారణంగా కడెం ప్రాజెక్టు ముంపు తప్పిపోయినా, గేట్లు మరమ్మతు లేక నీళ్లన్నీ వృథాగా పోతున్నాయని మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు. ఆమె కాంగ్రెస్ నాయకులతో కలిసి కడెం ప్రాజెక్టను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కడెం ప్రాజెక్ట్ తెగిపోకుండా ఆగిందని అది చాలా అదృష్టమన్నారు. అప్పటి పాలకులు ప్రాజెక్ట్ ను పటిష్టంగా కట్టడంతో దేవుని దయ వల్ల కట్ట తెగిపోకుండా ఉందని అన్నారు. ఎత్తిన ప్రాజెక్ట్ గేట్లు దిగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో నీరంతా వృథాగా గోదావరి నదిలోకి పోతోందన్నారు. వెంటనే ప్రభుత్వం ప్రాజెక్టు గేట్లను మరమ్మతులు చేయించాలని డిమాండ్ చేశారు. వాటికి మరమ్మతు చేసి నీరు నిల్వ చేస్తేనే ఆయకట్టుకు సాగు నీరు అందుతుందన్నారు.లేకపోతే ఈ సంవత్సరం పంటలు పండే అవకాశం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం త్వరగా నిధులు మంజూరు చేసి ఆయకట్టు రైతులను ఆదుకోవాలని కోరారు.