ఆదివాసీ ‘అమ్మ’కు పురిటి కష్టం
ఆదివాసీలకు వాగులు, వంకలతో కష్టాలు తప్పడం లేదు. ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలను వీటిని దాటించుకుంటూ ఆసుపత్రులకు తీసుకువెళ్లాంటేనే వారి పరిస్థితి గగనంగా మారుతోంది. సోమవారం ఓ గర్భిణీ వాగు వద్దనే ప్రసవించింది. ఇంద్రవెల్లి మండలం హర్కాపూర్ పంచాయతీ పరిధి మామిడిగూడ(జి)కు చెందిన గర్భిణి ఉయిక గాంధారికి పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో గ్రామస్తులు అమెను ఆసుపత్రి కి తరలించారు. ఇంద్రవెల్లి పీహెచ్సీకి తరలిస్తుండగా మామిడిగూడ వాగు ఉద్ధృతి పెరిగింది. నొప్పులు తీవ్రం కావడంతో ఆమె వాగు ఒడ్డునే ప్రసవించింది. విషయం తెలుసుకుని పిట్టబొంగరం వైద్య సిబ్బంది వాగు దాటి వెళ్లారు. గ్రామస్ధుల సాయంతో బాలింత, పసిబిడ్డలను క్షేమంగా వాగు దాటించారు. దాదాపు కిలోమీటరు వరకునడిపించుకుంటూ తీసుకొచ్చి అంబులెన్స్ ఎక్కించి ఇంద్రవెల్లి పీహెచ్సీకి తరలించారు.. ప్రస్తుతం తల్లీ,బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.