అర్ధరాత్రి ఆందోళన విరమణ
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ (Basara IIIT) విద్యార్థులు ఎట్టకేలకు తమ ఆందోళన విరమించారు. ఆహార నాణ్యత బాగోలేదని.. మెస్ కాంట్రాక్టర్‌ని వెంటనే మార్చాలంటూ శనివారం రాత్రి భోజనం మానేసిన విద్యార్థులు.. ఆదివారం కూడా ఏమీ తినకుండా నిరసన వ్యక్తం చేశారు. మెస్ డైనింగ్ హాల్లోనే బైఠాయించి నినాదాలు చేశారు.విద్యార్థులతో సమావేశం నిర్వహించిన ఇంఛార్జి వీసీ వెంకటరమణ వారిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తోటి విద్యార్థులకు ఇబ్బందులు కలగజేసినా, ఆందోళనలు చేసినా కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇంఛార్జి వీసీ హెచ్చరికపై విద్యార్థులు మండిపడ్డారు.
ఆదివారం సాయంత్రం 7 గంటల సమయంలో అంతా కలిసి వీసీ కార్యాలయం వద్దకు చేరుకొని ఆందోళనను కొనసాగించారు. తమ డిమాండ్లు నెరవేరేదాకా ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. మూడు మెస్‌ల కాంట్రాక్టర్లను తొలగించాల్సిందేనని పట్టుబట్టారు. అధికారులు చర్చలకు పిలిచినా ఎవరూ వెళ్లలేకుండా… వారే తమ వద్దకు వచ్చి సమస్యలు వినాలని డిమాండ్ చేశారు. ఇరువర్గాలూ పట్టుదలగా వ్యవహరించడంతో ఆదివారం రాత్రి దాకా ఆందోళన కొనసాగింది. చివరకు కొంత మంది విద్యార్థులు పట్టు వీడి అధికారుల వద్దకు వెళ్లి చర్చించారు. అధికారులు వారితో పలు అంశాలపై చర్చించి నచ్చజెప్పడంతో రాత్రి 11 గంటల సమయంలో ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించిన విద్యార్థులు వారి హాస్టల్ గదులకు వెళ్లిపోయారు.