క్వింటాల్ పత్తి ధర రూ.8300
ఆదిలాబాద్ మార్కెట్‌లో కొనుగోళ్లు ప్రారంభం
Quintal price of cotton is Rs.8300: ఆదిలాబాద్ జిల్లా పత్తి మార్కెట్‌లో కొనుగోళ్లు శుక్రవారం ప్రారంభం అయ్యాయి. మొదటి రోజే క్వింటాల్ పత్తి ధర రూ. 8300 పలికింది. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యే జోగు రామన్న కొనుగోళ్లు ప్రారంభించారు. రాష్ట్రంలోని ఖమ్మం, జమ్మికుంట, వరంగల్ మార్కెట్ యార్డుల్లో ఇప్పటికే పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. అక్కడ క్వింటాలుకు రూ.8.150 నుంచి రూ.8,450 వరకు ధర పలుకు తుంది. ఇక్కడ కూడా రూ. 8వేలకు పైనే పలికే అవ కాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎంత ధర పలుకుతుందని రైతులు ఆశగా ఎదురుచూశారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాలుకు రూ.6,300 ఉంది. కాని ఈ ఏడాది బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధర ఉంది. దీంతో సీసీఐ కొను గోళ్లు అవసరం లేకుండా పోయింది. వ్యాపారులే పత్తిని కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్ మార్కె ట్లో కాంటాలు, ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేశారు.
ధర పెరిగేనా..?
వాస్తవానికి రెండు, మూడేండ్లుగా అంతర్జాతీయ మార్కెట్లో పత్తి ధర పెరుగుతోంది. దానికి తోడు ఈ ఏడాది భారీ వర్షాలు, తెగుళ్ల కారణంగా దిగుబడి చాలా మేరకు తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో పత్తి ధర నిలకడగా పెరుగుతుందా..? లేదా..? అనే విషయంలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వ్యాపారులతో జరిగిన సమావేశంలో పత్తిలో తేమ శాతం 8 శాతం పెరిగితే కోత విధిస్తామని వ్యాపారులు స్పష్టం చేశారు. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ప్రతి ఏడాది తేమ విషయంలో గొడవ జరుగుతూనే ఉంది. మార్కెట్లో నిర్ణయించిన ధర 8 శాతం తేమ ఉన్న పత్తికి లభిస్తుంది. ఆ తర్వాత తేమ శాతం పెరిగిన కొద్ది ధర తగ్గుతుంది. వరుసగా వర్షాలు కురుస్తుండ టంతో పత్తిలో తేమ శాతం 20 వరకు ఉంటుందని రైతులు అంటున్నారు. సహజంగా వచ్చే తేమను తగ్గించాలంటే పత్తిని ఆరబెట్టాలి. అసలు ఆరబెట్టేందుకు వీలు లేకుండా అప్పుడప్పుడు వర్షం కురుస్తూనే ఉంది. పత్తిని తీసుకొచ్చిన వాహనంలో తేమ శాతాన్ని పరిశీలిస్తే ఒక్కో చోట ఒక్కో మాదిరిగా వస్తుండటంతో రెండేళ్లుగా వాహనంలోని పత్తిలో మూడు చోట్ల తేమ శాతం లెక్కించి సగటు తేమ శాతాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఈ ఏడాది అదే మాదిరిగా తేమను చూడనున్నారు..