నల్లనేలలో అరెస్టుల పర్వం
Arrests continue in Singareni: సింగరేణి వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘ నేతలతో పాటు వామపక్ష నేతలను సైతం ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. నేడు రామగుండంలో ప్రధానమంత్రి మోదీ పర్యటన నేపథ్యంలో సింగరేణిలో కార్మిక సంఘాలు నల్లబ్యాడ్జీలతో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో కొన్ని చోట్ల కార్మిక సంఘ నేతలను ముందస్తు అరెస్టులు చేయగా, మరికొన్ని చోట్ల బొగ్గుబాయిల మీదనే అరెస్టులు కొనసాగించారు. ఉదయమే టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డిని అరెస్టు చేసి పోలీస్స్టేషన్ తరలించిన పోలీసులు, హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్, సిఐటియు కార్మిక నాయకుడు రాజారెడ్డి, సిపిఐ నాయకుడు దినేష్ తో సహా పలువురు అరెస్ట్ చేశారు.
ఇక గోదావరిఖని 11ఇంక్లైన్ గనిపై ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్ ఆధ్వర్యంలో వారిని అరెస్టు చేసి పోలీస్స్టేషన్ తరలించారు. పోలీసుల అరెస్టులపై కార్మిక సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి ని నిర్వీర్యం చేయడానికే మోడీ పర్యటన అని ఆయనను అడ్డుకోవడంలో తప్పేమిటని వారు ప్రశ్నించారు.