కాంగ్రెస్ పార్టీ త్యాగం
ఈటెలకు పరోక్ష మద్దతు ఇచ్చిన హస్తం శ్రేణులు
ఉప ఎన్నికల్లో అందరూ ఈటెల రాజేందర్ గెలుపు గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే తాను కొవ్వొత్తిలా కరిగిపోయి వెలుగు పంచిన కాంగ్రెస్ పార్టీ గురించ ఎవరూ చర్చించుకోవడం లేదు. ఉప ఎన్నికల్లో ఓట్లు చీలిపోవద్దనే కారణంతో కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గింది. శత్రువుకు శత్రువు మిత్రుడు అనే దాన్ని నిజం చేస్తూ కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్‌లో ఈటెల రాజేందర్‌కు పరోక్షంగా మద్దతు ఇచ్చింది. నాగార్జున సాగర్, దుబ్బాకలో పనిచేసినట్లు ఆ పార్టీ శ్రేణులు పని చేయలేదు. మొదట కొద్ది రోజులు ఉత్సాహంగా ముందుకు సాగిన కాంగ్రెస్ పార్టీ సడెన్‌గా వెనక్కి తగ్గింది. ఆ పార్టీ ఈ ఉప ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకుంది. గత ఎన్నికల్లో దాదాపు 61 వేల ఓట్లు సాధించిన హస్తం పార్టీ కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేదు. సీనియర్ నేతలు అంతా టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై విమర్శలకు దిగుతున్నారు. టీఆర్ఎస్ను ఓడించేందుకే తాము ఈటెల రాజేందర్‌కు మద్దతు ఇచ్చినట్లు ఎంపీ కోమట్ రెడ్డి వ్యాఖ్యానించడం గమనార్హం. బల్మూరి వెంటక్ను రేవంత్, భట్టి విక్రమార్క కలిసి బలి పశువును చేశారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆరోపించారు. ఏదిఏమైనా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో బరిలోకి దిగితే ఆ పార్టీ గెలవకపోగా అది ఖచ్చితంగా టీఆర్ ఎస్ గెలుపు కోసం దోహదం చేసినట్లయ్యేది. వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో తన శత్రువు టీఆర్ ఎస్‌ను ఓడించగలిగింది.