కాంగ్రెస్‌లో మళ్లీ బెదిరింపు రాజకీయాలు
కొత్త పార్టీ పెడతానని మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్ రావు లీకులు - తనకు పార్టీలో సరైన ప్రాతినిథ్యం దక్కకపోవడంతో ఆగ్రహం - అడిగిన పదవులు ఇవ్వడం లేదనే అలక - ఖచ్చితంగా బయటకు వెళ్లిపోతారని కొక్కిరాల అనుచరుల వెల్లడి
మంచిర్యాల – కాంగ్రెస్ పార్టీలో మళ్లీ బెదిరింపు రాజకీయాలు మొదలయ్యాయి. కొత్త పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మొదలయ్యాక పాత సంప్రదాయానికి మళ్లీ తెర లేచింది. మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు తనకు పార్టీలో ప్రాతినిథ్యం దక్కడం లేదని అలకబూనారు. కొత్త పార్టీ పెడతానని లీకులు ఇవ్వడంతో ఒక్కసారిగా పార్టీలో రాజకీయాలు వేడెక్కాయి.
ప్రేంసాగర్ రావు ఉమ్మడి ఆదిలాబాద్ రాజకీయాలకు కేంద్ర బిందువు. ఆయన ఎప్పుడూ రాజకీయాల్లో హాట్ టాపికే. ఇప్పుడు కూడా ఆయన మళ్లీ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారారు. తాజాగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారని, ఉత్తర తెలంగాణలో ఇందిరా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తారని ప్రచారం సాగుతోంది. ఇంద్రవెళ్లి సభలో చెప్పినట్లు కష్టపడ్డవారికి పదవులు ఇవ్వాలని, తన వారికి ప్రాధాన్యత కల్పించాలని ఆయన అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. శనివారం సాయంత్రం ఆయన ముఖ్యులతో మంచిర్యాలలోని ముల్కల్ల ప్రాంతంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
అడిగిన పదవులు ఇవ్వడం లేదనే అలక..
ప్రేంసాగర్‌రావు తనకు పార్టీలో సరైన ప్రాతినథ్యం దక్కలేదని, అడిగిన పదవులు ఇవ్వడం లేదని అలక వహించినట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల కిందట ముఖ్య నేతలతో సమావేశంలో ఆయన ఆరు టిక్కెట్లు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో బోథ్, ఖానాపూర్, బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల, ఆసిఫాబాద్ టిక్కెట్లు అడిగారు. ఒకవేళ బెల్లంపల్లి వినోద్‌కు ఇస్తే ఆదిలాబాద్ టిక్కెట్ తన అనుచరురాలు గండ్రత్ సుజాతకు ఇవ్వాలని కోరారు. అదే సమయంలో ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సాజిద్‌ఖాన్ స్థానంలో బోథ్‌లో ఉన్న తన అనుచరులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో పీసీసీ జనరల్ సెక్రటరీలుగా మంచిర్యాలకు చెందిన తన అనుచరులు పిన్నింటి రఘునాథ రెడ్డి, చిట్ల సత్యనారాయణ, శేఖర్‌లలో ఎవరికైనా ఇవ్వాలని కోరారు.
సరైన ప్రాతినిథ్యం దక్కడం లేదనేనా..?
తనకు మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా కానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కానీ కావాలని అడిగారు. ఆయనకు ఆ పదవులు దక్కే అవకాశం లేకపోగా, క్రమశిక్షణా సంఘం సభ్యుడిగా గడ్డం వినోద్‌కు పదవి ఇచ్చారు. దీంతో ఆయన ఆగ్రహం ఇంకా పెరిగింది. పీసీసీ చీఫ్ స్వయంగా ప్రేంసాగర్‌రావుకు పదవి ఇస్తామని కార్యకర్తల ముందు హామీ ఇచ్చారు. అది నెరవేరకపోగా పార్టీలో ముఖ్య నేతల నుంచి సరైన స్పందన రాకపోవడం ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఆయన కొత్త పార్టీ విషయంలో లీకులు ఇచ్చారనే ప్రచారం సాగుతోంది. తమ నేత ఖచ్చితంగా బయటకు వెళ్తారని కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అనుచరులు చెబుతున్నారు. అయితే ఇది కేవలం బెదింపులేనా..? లేక నిజంగానే కాంగ్రెస్ పార్టీ వీడుతారా..? అనేది కొద్దిసేపట్లో తేలనుంది.