నస్పూరు బల్దియాకు రూ. 5 కోట్లు నష్టం
-అనుమతులు లేకుండానే పెద్ద ఎత్తున భవనాల నిర్మాణం
-అధికారులు, రాజకీయ నేతల అవినీతి
-ప్రభుత్వానికి నష్టం జరుగుతున్నా కిమ్మనని వైనం
Naspur Municipality: మంచిర్యాల జిల్లా నస్పూరు మున్సిపాలిటీ పరిధిలో అక్రమ కట్టడాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. పైరవీకారుల అండదండలతో అనుమతులు లేకుండానే దర్జాగా భవనాలు నిర్మిస్తున్నారు. ఎక్కడ చూసినా నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. మున్సిపాలిటీ పర్మిషన్లో పొందుపరిచిన ప్లాన్‌కు పొంతన లేకుండా కొన్ని, అనుమతే తీసుకోకుండా మరికొన్ని నిర్మిస్తున్నారు. ఇక అంతస్తుల పెంపు, సెట్‌బ్యాక్ వదలకపోవడం, సెల్లార్, పార్కింగ్ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్‌ల నిర్మాణం.. ఇలా ఇష్టారీతిగా నిర్మాణాలు చేపడుతున్నారు.
అవినీతికి వేదిక సర్వే నంబర్ 42
ఇప్పటికే అవినీతికి మారు పేరుగా నిలిచిన సర్వే నంబర్ 42లో యథేచ్ఛగా నిర్మాణాలు చేస్తున్నారు. ఇందులో ఇప్పటి వరకు దాదాపు 96 భవనాలు నిర్మించగా, అందులో చాలా వాటికి అనుమతులు లేవు. ఇక మున్సిపాలిటీల్లో చాలా మంది అటు అధికారులు, రాజకీయనాయకులకు లంచాలు ఇచ్చి మేనేజ్ చేసుకుంటున్నారు. దీంతో నస్పూరు మున్సిపాలిటీలో అవినీతి అధికారులు, నేతల ఇష్టారాజ్యంగా మారింది. అక్రమార్కులకు కొందరు పైరవీకారులు వత్తాసు పలుకుతున్నారు. ‘‘మొదలు భవనం కట్టండి.. ఆ తర్వాత బీఆర్ఎస్ కింద దరఖాస్తు చేసుకోవచ్చని’’ యజమానులకు భరోసా ఇస్తున్నారు. పలువురు ఇళ్ల నిర్మాణానికి సరైన అనుమతులు సైతం తీసుకోవడం లేదు.
టాక్స్ సైతం వసూలు చేయడం లేదు…
ఇంటి అనుమతి కావాలంటే టీఎస్ బీపాస్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఆ బిల్డింగ్ కు సంబంధించి డిప్యూటీ తహసీల్దార్, టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారి, మున్సిపాలిటీలో ఉన్న రెవెన్యూ అధికారి మోకాపై ఉన్నారా..? లేదా..? అని పరిశీలిస్తారు. ఈ తంతంగం పూర్తయిన తర్వాత మున్సిపల్ కమిషనర్ బిల్డింగ్‌కు అనుమతులు ఇస్తారు. కానీ, ఇవేవీ లేకుండానే ఇష్టం వచ్చినట్లు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ లెక్కన ఒక్కో భవనానికి రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు ఆదాయం కోల్పోతున్నారు. ఇంటి నిర్మాణం అయిన తర్వాత కూడా మున్సిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ టాక్స్ వసూలు చేయాలి. కానీ, ఇంటి నంబర్లే లేకపోవడంతో ఇప్పటి వరకు టాక్స్ కూడా వసూలు చేయడం లేదు.
దాదాపు ఐదు కోట్ల మేర నష్టం…
ఇష్టారాజ్యంగా ఇండ్ల నిర్మాణాలు చేపడుతుండటంతో బల్దియా తన ఆదాయాన్ని కోల్పోతోంది. నస్పూరు బల్దియాకు ఇప్పటి వరకు ఐదు కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు సమాచారం. 54 సర్వే నంబర్లో ఇంటి అనుమతులు తీసుకుని పెద్ద ఎత్తున కమర్షియల్ భవనం నిర్మిస్తున్నారు. దానికి అనుమతులు లేకున్నా భవన నిర్మాణం పూర్తయ్యింది. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం పట్ల పెద్దఎత్తున డబ్బులు చేతులు మారినట్లు సమాచారం. ఓ కంపెనీ సర్వీస్ సెంటర్ సైతం నడుపుతున్నారు. అయినా అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు సోయి లేకుండా ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి.