ఎస్టీపీపీకి మరో రెండు మణికిరీటాలు
-సింగరేణి థర్మల్ పవర్ కేంద్రానికి రెండు జాతీయ స్థాయి అవార్డులు
-అత్యుత్తమ పవర్ ప్లాంట్, ఉత్తమ ఫ్లైయాష్ అవార్డులు కైవసం
-అవార్డు స్వీకరించిన డైరెక్టర్ డి.సత్యనారాయణ రావు
-అభినందనలు తెలిపిన సీఅండ్ఎండీ
సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ మరో రెండు మణికిరీటాలను సాధించింది. ఇప్పటికే అత్యుత్తమ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ తో జాతీయ స్థాయిలో నెంబర్-1 ప్లాంట్ గా గుర్తింపు పొందిన ఎస్టీపీపీ మరో రెండు ప్రతిష్టాత్మక అవార్డులను సాధించింది. కేంద్ర ఇరిగేషన్, ఇంధన బోర్డు (సీబీఐపీ) ఢిల్లీలో నిర్వహించిన జాతీయస్థాయి సదస్సులో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం అత్యుత్తమ పని తీరు గల ప్లాంట్ గా ప్రతిభా పురస్కార అవార్డు అందుకుంది. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్.కె.సింగ్ ఈ అవార్డు సింగరేణి డైరెక్టర్ (ఈఅండ్ఎం) సత్యనారాయణ రావుకు బహూకరించారు.
మరో అవార్డు సైతం కైవసం..
సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం అత్యుత్తమ పీఎల్ఎఫ్ తో జాతీయ స్థాయిలో నెంబర్-1 స్థానంలో నిలవడంతో పాటు నీరు, బొగ్గు వినియోగం, కాలుష్య నివారణ చర్యల్లో అత్యుత్తమ ప్రమాణాలు పాటిస్తున్నందుకు ఈ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ప్లాంట్ అవార్డు అందజేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. కాగా, ముంబాయికి చెందిన ప్రముఖ మిషన్ ఎనర్జీ సంస్థ గోవాలో నిర్వహించిన ఫ్లైయాష్ నిర్వహణ జాతీయస్థాయి సదస్సులో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని బెస్ట్ ఫ్లైయాష్ యుటిలైజేషన్ ప్లాంట్ గా గుర్తించి అవార్డు ప్రదానం చేసింది. మహా జెన్కో ఈడీ (ఎన్విరాన్మెంట్, సేఫ్టీ) డాక్టర్ నితిన్వాగ్ నుంచి ఎస్టీపీపీ తరఫున ఏజీఎం కె.శ్రీనివాసులు, ఎస్ఈ కె.కిరీటీ, ఈఈ రమేష్ అవార్డు స్వీకరించారు.
ఇదే స్ఫూర్తితో పని చేయండి..
సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి జాతీయ స్థాయిలో రెండు పురస్కారాలు లభించడం పట్ల సింగరేణి సీఅండ్ఎండీ ఎన్.శ్రీధర్ హర్షం వ్యక్తం చేశారు. ప్లాంట్ ఉద్యోగులు, అధికారులకు అభినందనలు తెలిపారు. ఇదే ఒరవడితో ఇకముందు కూడా అత్యుత్తమ పనితీరు కనపర్చాలని, రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చాలని కోరారు. అవార్డు స్వీకరించిన సందర్భంగా డైరెక్టర్ (ఈఅండ్ఎం) డి.సత్యానారాయణ రావు మాట్లాడుతూ మూడేళ్లుగా అత్యుత్తమ ఫ్లైయాష్ యుటిలైజేషన్, అత్యుత్తమ నీటి వినియోగం, ఉత్తమ నిర్వహణ అవార్డులను దాదాపు ప్రతి ఏడాది సాధిస్తున్నామని తెలిపారు. ఇదే విధంగా ఇకముందు కూడా పనిచేస్తూ జాతీయ స్థాయిలో మరింత మంచి పేరు సాధిస్తామని తెలిపారు.
అవార్డులు.. రికార్డులు..
సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం విద్యుత్ ఉత్పత్తిలో భాగంగా వెలువడే ఫ్లైయాష్, బాటమ్ యాష్ లను నూటికి నూరు శాతం సద్వినియోగం చేస్తూ అవార్డులను సాధిస్తోంది. 2020-21లో 11.29 లక్షల టన్నుల యాష్ విడుదల కాగా 11.33 లక్షల టన్నుల ఫ్లైయాష్ తదితర కర్మాగారాలకు సరఫరా చేసి 107.33 శాతం వినియోగ రికార్డు సృష్టించింది. అలాగే 2021-22లో 15.57 లక్షల టన్నుల ఫ్లైయాష్ సరఫరా చేసి 117 శాతం వినియోగాన్ని నమోదు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి 28వ తేదీ వరకు విడుదలైన 12.09 లక్షల టన్నుల ఫ్లైయాష్ పూర్తిస్థాయిలో సిమెంట్ తయారీ పరిశ్రమలకు సరఫరా చేసి 100 శాతం వినియోగాన్ని రికార్డు చేసింది.
ఫ్లైయాష్‌తో రూ. 24.28 కోట్ల ఆదాయం
సింగరేణి సంస్థ నుంచి తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన 10 ప్రధాన సిమెంట్ కంపెనీలు ఫ్లైయాష్ స్వీకరిస్తున్నాయి. వీటిలో తెలంగాణ రాష్ట్రం నుంచి ఓరియంట్, కేశోరాం సిమెంట్, పెన్నా సిమెంట్‌తోపాటు కర్ణాటక రాష్ట్రంలోని చెట్టినాడు సిమెంట్, అల్ట్రాటెక్, ఏసీసీ, కేశోరాం, కలబుర్గీ సిమెంట్ కంపెనీలు ఉన్నాయి. సిమెంట్ కంపెనీలకు ఫ్లైయాష్‌ను రైల్వే రేకుల ద్వారా సరఫరా చేస్తుండగా.. ఇప్పటివరకు 61 రేకుల ద్వారా ఫ్లైయాష్ సరఫరా జరిగింది. ఫ్లైయాష్ ఈ కంపెనీలకు విక్రయించడం ద్వారా సింగరేణి సంస్థకు గత మూడేళ్లలో 24.28 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. ఇటుకల తయారీ దారులు కూడా ఈ బాటమ్ యాష్‌ను వినియోగిస్తున్నారు. ఈవిధంగా సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో వెలువడే మొత్తం బాటమ్ యాష్ సద్వినియోగం అవుతోంది.