బెల్లంపల్లిలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
Inter student commits suicide in Bellampally : బెల్లంపల్లి పట్టణంలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. పరీక్ష సరిగ్గా రాయలేదనే మనస్థాపంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. బెల్లంపల్లి పట్టణంలోని కాల్టెక్స్ ఏరియాకు చెందిన రాపెల్లి శివకృష్ణ (18) ప్రగతి జూనియర్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. గురువారం తండ్రి శంకర్ ఆ బాలున్ని పరీక్ష కేంద్రం వద్ద దించి వచ్చాడు. తల్లి తండ్రి ఇద్దరూ మంచిర్యాల వెళ్లారు. ఈ రోజు సంస్కృతం పరీక్ష రాసి వచ్చిన శివకృష్ణ తల్లి శారదకి ఫోన్ చేసి పరీక్ష సమయంలో కడుపు నొప్పి వచ్చిందని సరిగ్గా రాయలేదని బాధపడ్డాడు. దీంతో వారు ఏం కాదు… అని అతనికి సర్ది చెప్పారు. అనుమానం వచ్చిన తల్లిదండ్రులు పక్క వారికి ఫోన్ చేసి శివకృష్ణను చూసుకోమని చెప్పారు.
వారు వచ్చేసరికే శివ ఉరివేసుకుని కనిపించాడు. దీంతో వారు పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శవాన్ని పంచనామా నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చదువులో చురుకుగా ఉండే తమ కుమారుడు మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.