సారీ చెప్పిన ఈడీ..
Enforcement Directorate: కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తొలిసారిగా ఒకరికి క్షమాపణలు చెప్పింది. లిక్కర్‌స్కామ్ ఛార్జ్‌షీట్‌లో ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్ పేరు చేర్చడంలో పొరపాటు జరిగిందని ఆ సంస్థ అంగీకరించింది. ఆ స్థానంలో రాహుల్‌సింగ్ పేరు చేర్చడానికి బదులు పొరపాటున సంజయ్ సింగ్ పేరు టైప్ చేశారని వెల్లడించింది. జరిగిన తప్పుకు చింతిస్తునట్లు ఎంపీ సంజయ్‌సింగ్‌కు ఈడీ తరపున కేంద్ర ఆర్ధికశాఖ కార్యదర్శి లెటర్ రాశారు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. ఢిల్లీ మద్యం కేసులో ఈడీ జోరుగా దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ పేరులో చార్జీషీట్లో నమోదు చేశారు. అయితే, అసలు పేరు చేర్చాల్సింది ఆయనది కానది, రాహుల్‌సింగ్ అనే వ్యక్తి పేరు బదులు సంజయ్ సింగ్‌గా చేర్చామని తెలిపారు. దీనికి సంబంధించి కేంద్ర ఆర్థిక కార్యదర్శి ఎంపీకి లేఖ రాశారు. అయితే ఈడీ తనకు క్షమాపణలు చెప్పడంపై ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ స్పందించారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతోనే ఈడీ ఆప్ నేతలను టార్గెట్ చేసిందని ఆరోపించారు. ఈడీ అసలు టార్గెట్ సీఎం కేజ్రీవాల్ అని వ్యాఖ్యానించారు. అలాగే లిక్కర్ స్కామ్ పేరుతో అక్రమంగా ఆప్ నేతలపై కేసులు పెట్టారని మండిపడ్డారు. ఈడీ చేసే విచారణ అబద్ధాల మూట విమర్శించారు.
అరవింద్ కేజ్రీవాల్‌కు ప్రధానీ మోదీ భయపడుతున్నారని అందుకే ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటిసారిగా ఈడీ తన పేరు పొరపాటున చేర్చి క్షమాపణలు చెప్పిందని ఇదంతా ఓ నకిలీ దర్యాప్తని ఆరోపించారు. అధికారులు చేసిన “తప్పుడు, అవమానకరమైన ప్రకటనలు” మీడియాలో విస్తృతంగా ప్రచారం అయ్యి, తనకు అపఖ్యాతి తెచ్చిపెట్టాయని సింగ్ అన్నారు. అధికారులు పదవి దుర్వినియోగం చేసి అవాస్తవమైన, తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన చిత్తశుద్ధి, ప్రతిష్టకు భంగం కలిగించిందన్నారు. నిరాధారమైన, ఆమోదయోగ్యం కాని ప్రకటనలు తన రాజకీయ ప్రతిష్టను ప్రభావితం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల్లో తన విశ్వసనీయత కూడా తీవ్రంగా దెబ్బతీశాయని ఆరోపించారు.